telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లదే ప్రధాన బాధ్యత

ghmc hydeerabad

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లదే ప్రధాన బాధ్యత అని, ప్రతి సర్కిల్లోని అన్ని వార్డులకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత సంబంధిత డిప్యూటీ కమిషనర్లదేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీహెచ్ఎంసీ కమిషనర్, నోడల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అన్ని అధికారాలను భారత రాజ్యాంగం ఆర్టికల్ 243 జెడ్ఏ ద్వారా కల్పించడం జరిగిందని, నోటిఫికేషన్ తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు డిప్యూటీ కమిషనర్లు ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ల ఎన్నికల బాధ్యతలు ముసాయిదా ఎన్నికల జాబితా తయారు చేయడంతో మొదలయ్యిందని, ఈ నెల 13న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని, ఏ ఓటరు కూడా పోలింగ్ రోజున ఇబ్బంది పడకుండా ఓటరు లిస్ట్ ఉండాలన్నారు. త్వరలో పోలింగ్ కేంద్రాల ప్రచురణకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని, సాధ్యమైనంత వరకు గత ఎన్నికల్లో కేటాయించిన పోలింగ్ కేంద్రాలనే గుర్తించి ప్రచురిస్తే ఓటర్లకు సులువవుతుందని తెలిపారు. డిప్యూటీ కమిషనర్లుఎన్నికల పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాపులు, జోన్లు, సామాగ్రి తదితర అంశాలను ముందుగానే ఖరారు చేసుకోవాలని, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల సందేహాలు నివృత్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్నికలకు సంబంధించిన ప్రతి చట్టం, నియమ నిబంధనలు, సర్క్యూలర్లు, సంకలనాలపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. ఓటర్లకు, అభ్యర్థులకు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి జీహెచ్ఎంసీ లోని ప్రతి సర్కిల్, జోన్ మరియు ప్రధాన కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ లను వెంటనే ఏర్పాటు చేయాలని.. ఆ ఫోన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. DRC (Distribution, Reception and Counting) సెంటర్ల వద్ద అన్ని మౌలిక వసతులు కల్పించాలని, కోవిడ్ వ్యాప్తి చెందకుండా సంబంధించి జారీ చేసిన అన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల పరిశీలకునికి కావలసిన వసతి, సౌకర్యాలు కల్పించాలని, సర్కిల్ వారీగా ముఖ్యమైన అంశాలు, గణాంకాలకు సంబంధించిన నోట్ తయారు చేసుకోవాలని, సంబంధిత అసిస్టెంట్ పోలీసు కమిషనర్ తో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ప్లాన్ తయారు చేయించాలని వెల్లడించారు. పోలింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, ఎన్నికల సిబ్బందికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని, వోటింగ్ కంపార్టుమెంట్ లో వెలుతురు సరిగా ఉండేలా చూడాలని, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, వృద్ధులకు వికలాంగుల కొరకు వీల్ చైర్, రాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్లు విధులపై బయటికి వెళ్ళినప్పుడు తమ కార్యాలయంలో ప్రజల సందేహాలు నివృత్తి చేయడానికి ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని కోరారు.

Related posts