అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. కృష్ణా బేసిన్‌లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 30 శాతం నీటి కేటాయింపులు జరిగితే.. 60 శాతం నీళ్లు వాడుకునేందుకు అక్కడ ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని.. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంలు ఇచ్చిన జీవోలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులు అక్రమం అంటే.. అప్పుడు జారీ చేసిన జీవోలు అక్రమమా? అని సీఎం జగన్‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల నుంచి దృష్టి మళ్లించడానికి, తదితర అంశాలను సీఎం జగన్ తెరపైకి తీసుకువస్తున్నారని అన్నారు. జల వివాదాలను అపెక్స్ కౌన్సిల్‌లో తేల్చుకుందామని, సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుందామని చెప్పింది జగన్ కాదా? సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే కొత్త కేటాయింపులు జరుగుతాయని, దాని ప్రకారమే ప్రాజెక్టులు కడుతామని చెప్పింది జగన్ కాదా? అని ప్రశ్నించారు.
ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ఏమైనా అవగాహన ఒప్పందం చేసుకుందా? అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. నీటి పంపకాల్లో కేంద్రం కూడా వివక్ష చూపుతోందన్నారు. జలవివాదాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఏపీ సెటిలర్స్‌ను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని కొంత మంది నేతలు మాట్లాడుతున్నారు. వారు ఒకప్పుడు సెటిలర్స్ కావచ్చేమో.. ఇప్పుడు కాదని చెప్పారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపి తీరుతామని, ఈ ప్రాజెక్టు విషయంలో మోదీ తమకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నీటి కేటాయింపుల ప్రకారం ప్రాజెక్టులు కడుతామంటే ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ఇంజినీర్లు కూడా సహకరిస్తారని అన్నారు.
నా ఓటు నాకే పడిందా….అనుమానం వ్యక్తం చేసిన చంద్రబాబు