శ్రీలంకలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడులు ఆ దేశ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతాయి. చర్చిలు, హోటళ్లపై ఆత్మాహుతి దళ సభ్యులు జరిపిన దాడుల్లో 359 మంది చనిపోగా, 450 మంది వరకు గాయాలపాలయ్యారు. అయితే ఈ భీకర దాడులపై ముందస్తు సమాచారం ఉన్నా, నివారణ చర్యలు తీసుకోవడంలో లంక ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ లంక సర్కారు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశంలో టూరిజం రంగానికి ఊతమిచ్చేలా వీసా ఆన్ అరైవల్ ప్రాజక్టును ఉన్నపళంగా నిలిపివేశారు. 39 దేశాల ప్రజలకు శ్రీలంక చేరుకున్న తర్వాత ఎయిర్ పోర్టులో వీసా జారీ చేసేలా రూపొందించిన ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి జాన్ అమరతుంగ ఓ ప్రకటనలో తెలిపారు.
బాంబు పేలుళ్లలో విదేశీయుల హస్తం ఉన్నట్టు సందేహాలు వస్తున్న నేపథ్యంలో, సత్వర వీసాలతో ఎవరికీ అవకాశం ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకాన్ని విమర్శలపాలు చేయడం తమకు ఇష్టంలేదని అమరతుంగ తెలిపారు. లంక జీడీపీలో ఐదు శాతం ఆదాయం పర్యాటక రంగం ద్వారానే లభిస్తోంది. ఈస్టర్ పేలుళ్ల నేపథ్యంలో లంకలో పర్యాటకం దారుణమైన స్థాయికి పడిపోయింది. నిన్నటి దాకా శ్రీలంకలో పర్యటన అంటే ఎంతోమంది మక్కువ చూపేవాళ్లు. ఉగ్రదాడుల తర్వాత కూడా ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట బాంబులు పేలుతుండడంతో లంక అంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది.