telugu navyamedia
సామాజిక

శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రత్యేకత

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల ఎనిమిదో సంతానం. శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు కృష్ణుడు. శ్రీకృష్ణపరమాత్మ పుట్టిన శుభదినం కృష్ణ జన్మాష్టమి. దీనినే కృష్ణాష్టమి అని జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

కృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు. జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే, చిన్న పిల్లలను ఎంత గారాబంగా చూస్తారో, ఎంత చక్కగా ముస్తాబు చేస్తారు.. అలా కృష్ణయ్యను ముస్తాబు చేస్తారు. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి, చక్కగా పట్టు వస్త్రాలు కట్టి, ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసీ దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలని మెడలో వేస్తారు.

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని కూడా పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ… అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు.

గుజరాత్‌ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీజగదాష్టమి అని పిలుస్తారు. గుజరాతీల సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండగకు నాలుగురోజుల ముందునుంచే పూజలు ప్రారంభమవుతాయి. పండగకు నాలుగురోజుల ముందు వచ్చే చవితినాడు ఆవు, లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవులను సంరక్షించేవారు అయినందున గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా రెండ్రోజుల ముందుగానే మిఠాయిలు, ఫలహారాలు, కార, చుడువా, గారెలు వంటివి తయారుచేసుకుంటారు. ప్రత్యేకంగా మినపప్పు పిండితో తయారుచేసిన ‘అడిది’ పేరుగల మిఠాయిలు తయారుచేస్తారు. ఒకరోజు ముందు నుంచే ఉపవాసదీక్షలు పాటిస్తారు.

అన్నం స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయ గుజ్జును తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ నిర్వహిస్తారు. అనంతరం వూయలలో ఉంచి భక్తి, జోలపాటలతో భజన నిర్వహిస్తారు. వెన్న, పెరుగు, డ్రైప్రూట్స్‌తో తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కుండలో ఉంచి మహిళలు, యువతీ, యువకులు అందరూ కలిసి ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా, పురుషులు ప్రత్యేక నృత్యప్రదర్శనలతో ఆనందోత్సవాలను పంచుకుంటారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహీహండీని పగులగొట్టిస్తారు. అనంతరం మరునాడు ఉదయం వంటలు చేసుకొని భోజనాన్ని ఆరగిస్తారు.

కృష్ణుడు అనగానే యాదవులు గుర్తుకొస్తారు. వారు ఎక్కువగా కృష్ణుడిని కులదైవంగా కొలుస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యాదవులు అత్యధికులు కలిగిన గ్రామాల్లో కృష్ణాష్టమికి ఒకరోజు ముందు నుంచే ఈ వేడుకల్లో నిమగ్నమవుతారు. అర్ధరాత్రి నుంచి వేడుకలను ప్రారంభిస్తారు. కృష్ణాష్టమి రోజున ఊయలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనులపండువగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. తమ చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ముగింపుఘట్టంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు. ఆదిలాబాద్‌ పట్టణంలో యాదవసంఘం ఆధ్వర్యంలో ఏటా కృష్ణాష్టమి రోజున ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తారు.

Related posts