telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తన సమాధిపై ఏం రాయించాలో ముందే చెప్పిన ఎస్పీ బాలు

SPB

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతక్రియలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కన్నీటితో ఎస్పీ బాలుకు వీడ్కోలు పలికారు. ఈ రోజు (సెప్టెంబర్ 26) తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లో బాలు అంత్యక్రియలు ముగిశాయి. అయితే గతంలో తన మరణం తర్వాత సమాధిపై ఏమని రాయాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చిన విషయం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. 1999 సంవత్సరంలో ‘పాడుతా తీయగా’ మెగా ఫైనల్స్ కోసం బాలుతో పాటు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. రాజేశ్వర్ రావు, మహదేవన్, ఎల్‌ఆర్ ఈశ్వరి, సుశీల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలమురళీకృష్ణ అంటే ఎస్పీ బాలుకు చెప్పలేనంత అభిమానం, గురు భక్తి ఉండేది. అయితే ఈ కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ.. బాలు గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో ఆయన తెగ మురిసిపోయారు. బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు కానీ.. నేను ఎంత కష్టపడినా మా అబ్బాయిలా పాడలేను అంటూ పుత్ర వాత్సల్యం ప్రదర్శించారు మంగళంపల్లి. ఇదే విషయాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2017లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ ఆ రోజు (1999 సంవత్సరంలో) మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన గురించి మాట్లాడిన మాటలకంటే గొప్ప ప్రశంస, ఆస్తి ఇంకోటి లేదని అన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి గొప్ప సంగీత కళాకారులు అలాంటి మాటలతో తనకిచ్చిన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. తను చనిపోయిన తర్వాత సమాధిపై ఏమైనా రాయాలా అంటే ఒక అవతారపురుషుడు మంగళంపల్లి తనను ఇలా ప్రశంసించారని రాస్తే సరిపోతుందని బాలు పేర్కొన్నారు. తన తండ్రి కోరిక మేరకు ఈ వ్యాఖ్యలు బాలు సమాధిపై రాయించాలని ఆయన కుమారుడు చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts