telugu navyamedia
సినిమా వార్తలు

హిందీ భాష కోసం కోచింగ్ తీసుకుంటున్న దర్శకులు

Tollywood

ఒక భాషలో ఫేమస్ అయిన దర్శకులు వేరే భాషలో మెగా ఫోన్ పట్టుకున్నప్పుడు ఎదురయ్యే సమస్యలతో భాష ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. ఆయా భాషలపై పట్టులేకనే దక్షిణాది దర్శకుల్లో టాలెంట్ ఉన్నా ఉత్తరాదిన అంతగా రాణించలేకపోయారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ప్రభుదేవా. సౌత్‌లో మంచి డైరెక్టర్‌గా నిరూపించుకున్న ప్రభుదేవా హిందీ భాష మీద సరైన పట్టులేకే బాలీవుడ్‌లో కొన్ని విజయాలే సాధించగలిగాడు. అందుకే ఈ సమస్యను అధిగమించడానికి ప్రస్తుతం పలువురు తెలుగు దర్శకులు బాలీవుడ్‌లో సినిమాలు తీయడానికి హిందీ కోచింగ్ తీసుకుంటున్నారట.

ఇప్పటివరకూ చాలా మంది దక్షిణాది దర్శకులు బాలీవుడ్‌లో మెగా ఫోన్ పట్టుకుని తమ సత్తా చాటుకున్నారు. హిందీ భాషపై పట్టున్న దర్శకులు నటీనటులతోనూ, ఇతర సాంకేతిక వర్గంతోనూ చక్కగా కమ్యూనికేట్ అయి తమకు కావల్సిన రీతిలో ఇన్‌పుట్స్ తీసుకుని మంచి ఔట్ పుట్స్ సాధించారు. ఈ తరం దర్శకుల్లో అలా భాష మీద పట్టుసాధించి బాలీవుడ్ కెళ్లగలిగింది ఒక సందీప్ రెడ్డి వంగా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ‘అర్జున్ రెడ్డి’ తరహాలోనే జనాన్ని ఇంప్రెస్ చేశాయి.

‘అర్జున్ రెడ్డి’ ఘనవిజయానికి ఆ సినిమా డైలాగ్స్ ఏ విధంగా కారణమయ్యాయో ‘కబీర్ సింగ్’ చిత్రానికీ అదే రీతిలో డైలాగ్స్‌ను మంచి రైటర్స్‌తో దగ్గరుండి మరీ రాయించు‌కున్నాడట సందీప్ రెడ్డి. దానికి కారణం హిందీ భాషమీద అతడికున్న పట్టేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొందరు తెలుగు దర్శకులు బాలీవుడ్ నిర్మాతలకు కథ చెప్పగలిగే టాలెంట్ ఉన్నా భాష మీద అవగాహన లేకపోవడంతో అక్కడ మెగాఫోన్ పట్టుకొనే అవకాశాల్ని కోల్పోతున్నారు. అందుకే ఇప్పుడు కొందరు ప్రముఖ తెలుగు దర్శకులు హిందీ కోచింగ్ తీసుకుంటూ తమ భాషా పరిజ్ఞానాన్ని పెంచుకొనే పనిలో ఉన్నారట.

Related posts