telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ కోసం ఆ సిరీస్ రద్దుకు సిద్ధమైన బీసీసీఐ..?

కరోనా కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో గతేడాది సౌతాఫ్రికాతో రద్దయిన మూడు వన్డేల సిరీస్‌ను టీ20 సిరీస్‌‌గా మళ్లీ నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ ఐపీఎల్ సెకండాఫ్ విండో కోసం ఈ సిరీస్‌ను రద్దు చేసుకుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
ఐపీఎల్‌కు మించిన ప్రాక్టీస్‌ ఏదీ లేదని ఆ అధికారి పేర్కొన్నారు. ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను సెప్టెంబర్‌ మూడో వారంలో యూఏఈ వేదికగా తిరిగి కొనసాగించాలని బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తుందని పీటీఐకి తెలిపాడు. ‘సెప్టెంబర్‌ 18, 19 తేదీలు వీకెండ్ కావడంతో ఆ రెండు రోజుల్లో లీగ్ రీస్టార్ చేయాలనుకుంటున్నాం. లీగ్ పూర్తి చేయడానికి మూడు వారాల సమయం కేటాయించాం. అలా అక్టోబర్‌ 9 లేదా 10వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది. ఈ సవరించిన తేదీల్లో 31 మ్యాచ్‌లు పూర్తి చేయాల్సి రావడంతో 10 డబుల్‌ హెడర్స్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నాం. టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటన సెప్టెంబర్‌ 14న ముగుస్తుంది. దాంతో ఆ రెండు జట్ల ఆటగాళ్లను ప్రత్యేక ఫ్లైట్‌లో యూఏఈకి తరలిస్తాం. మిగతా దేశాల ఆటగాళ్లకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఆటగాళ్లందరికీ అక్కడ మూడు రోజుల క్వారంటైన్‌ ఉంటుంది. ఐపీఎల్ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌ను రద్దు చేస్తున్నాం. అలాగే నవంబర్‌లో భారత్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండు టెస్టుల సిరీస్‌ల షెడ్యూల్‌లో మార్పు ఉంటుంది.’అని సదరు అధికారి చెప్పుకొచ్చారు.

Related posts