telugu navyamedia
క్రీడలు వార్తలు

లంక పర్యటనకు రెండో భారత జట్టు…?

టెస్టు ఛాంపియన్‌షిప్‌, శ్రీలంక సిరీస్, ఇంగ్లండ్‌ సిరీస్‌, టీ20 ప్రపంచకప్.. కుదిరితే ఐపీఎల్ 2021 ఇలా వరుస పర్యటనలతో కోహ్లీసేన షెడ్యూల్ బిజీగా ఉంది. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఇంకో మూడు వారాల్లో లండన్ బయల్దేరబోతోంది భారత జట్టు. జూన్‌ 18-22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిశాక కోహ్లీసేన అక్కడే ఉండి కొన్ని వార్మప్‌ మ్యాచ్‌లు ఆడాక, ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆరంభించనున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడున్నర నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు, జులైలో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటించబోతుండటం విశేషం. అయితే ఇంగ్లండ్ పర్యటనలో భాగమైన ఆటగాళ్లను మినహాయించి పరిమిత ఓవర్ల క్రికెట్‌ స్పెషలిస్టులతోనే మరో భారత జట్టును ఎంపిక చేసి శ్రీలంకకు పంపనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. గతేడాదే ఈ పర్యటన షెడ్యూల్ అయి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూనే ఉంది. శ్రీలంక పర్యటనలో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చహర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్ యాదవ్ లాంటి సీనియర్లకు తోడు పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ చహర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రాహుల్‌ తెవాతియా లాంటి కుర్రాళ్లను ఈ పర్యటనకు పంపే అవకాశముంది. మనీష్ పాండే, దినేష్ కార్తీక్ కూడా రేసులో ఉండొచ్చు. ఇక గాయం నుంచి కోలుకుంటే శ్రేయస్‌ అయ్యర్‌ కూడా లంకకు వెళ్తాడు.

Related posts