బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా ఈ ఏడాది “కళంక్” అనే భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ మల్లీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తా పడింది. భారీ అంచనాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం నిరాశ పరిచింది. అయితే ఈ చిత్రం తరువాత సోనాక్షిసిన్హా ఓ బయోపిక్ లో నటించబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పారాలింపిక్ రజత పతక విజేత దీపామాలిక్ బయోపిక్ లో సోనాక్షి నటించనున్నట్లు ఓ ఇంగ్లీష్ పత్రిక కథనాన్ని వెల్లడించింది. 2016లో ఓ అవార్డు షో కార్యక్రమంలో సోనాక్షిసిన్హా పారాలింపిక్ చాంపియన్ దీపామాలిక్ ను కలుసుకుంది. తాను ఎంతగానో అభిమానించే దీపామాలిక్ ను కలుసుకున్న సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది సోనాక్షి. పాజిటివ్ ఎనర్జీతో ఎందరికో స్పూర్తివంతంగా నిలుస్తున్న మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం అభిమానిగా చాలా గొప్ప అనుభూతి అని ట్వీట్ చేసింది సోనాక్షి. అయితే ఈ బయోపిక్ లో సోనాక్షి నటిస్తుందా ? లేదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.