telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన సోమిరెడ్డి

somireddy chandramohan

రిజర్వేషన్లపై వర్గీకరణ హక్కు రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు వెలువరించిన అభిప్రాయాలను టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో ఇది కీలక పరిణామం అని, సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం శుభపరిణామం అని పేర్కొన్నారు.

రిజర్వేషన్లను సమూలంగా సమీక్షించడం ద్వారా అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ధర్మాసనం క్రీమీ లేయర్ ను కూడా ప్రస్తావించిందని తెలిపారు. ప్రస్తుతం ఇది సమాజానికి ఎంతో అవసరమైన అంశం అని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో మూడు తరాలుగా రిజర్వేషన్లను అనుభవిస్తున్న వారిని చూస్తున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో మూడు తరాలుగా ఎలాంటి రిజర్వేషన్ ఫలాలు అనుభవించకుండా అణగారిన వర్గాలుగా మిగిలిన వారిని కూడా చూస్తున్నామని వెల్లడించారు.

ఈ అసమానతలను తొలగించేందుకు క్రీమీ లేయర్ విధానాన్ని కూడా సమీక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. నాడు ఎస్సీ వర్గీకరణపై విధానపరమైన నిర్ణయంతో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు వెల్లడించారు. అప్పట్లో పార్లమెంటులో చట్టం చేయాలనే నిబంధనతో అసెంబ్లీలో చేసిన తీర్మానం అమలు కాలేదని అన్నారు. వర్గీకరణ హక్కు రాష్ట్రాలకే ఉందని ఇప్పుడు కోర్టు చెబుతోందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Related posts