telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సాఫ్ట్‌వేర్‌ ప్రియుడి కోసం లక్షన్నర ఇచ్చి మోసపోయిన ప్రియురాలు

వారిద్దరు ఆరేళ్లుగా ఒకరినొకరు ఘాటుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు ప్రియురాలితో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడు.తీరా పెళ్లి చేసుకోమని కోరగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నాకి దిగిన సంఘటన చిన్నచింతకుంట మండల కేంద్రంలో  వెలుగుచూసింది. మండలంలోని మద్దూర్‌ గ్రామానికి చెందిన జుట్ల నర్మద, చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన మక్క మోహన్‌కుమార్‌ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

ప్రేమలో పడ్డ తర్వాత నర్మద, మోహన్‌కుమార్‌ ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లారు. నర్మద చిక్కడపల్లి ప్రాంతంలోని ఓ ఉమెన్స్‌కాలేజీలో  విద్యనభ్యసిస్తూనే ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. అలాగే, మోహన్‌కుమార్‌ ఓ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించి కాగ్నిజెంట్‌ డీఎల్‌ఎఫ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలోనే మోహన్‌ పైచదువు కోసం నర్మద రూ.1,50,000 వరకు సాయం అందించింది.  నర్మద కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసిన మోహన్‌ మేమిద్దరం పెళ్లిచేసుకుంటామని, వేరే సంబంధాలు చూడవద్దని చెప్పడంతో నర్మద కుటుంబీకులు కూడా ఆమె సంబంధాల గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో దాదాపుగా 5ఏళ్లుగా వీరిద్దరు కలిసి సహజీవనం కొనసాగించారు.

6నెలల క్రితం ఇరు గ్రామాలకు చెందిన పెద్దల సమక్షంలో మోహన్‌కుమార్‌ నర్మదతో పెళ్లికి అంగీకారం కుదుర్చుకున్నారు. అప్పటి నుండి పెళ్లి చేసుకుందామని నర్మద, మోహన్‌కుమార్‌ను పట్టుపడుతూ వచ్చింది. తన తల్లి ఒప్పుకోవడం లేదని అందుకే నీతో పెళ్లికి నిరాకరిస్తున్నానని మోహన్‌ తేల్చిచెప్పాడు.దీంతో తాను మోసపోయానని గ్రహించి కొన్నిరోజుల కిందట ఎస్పీని కలిసే ప్రయత్నం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించడంతో నర్మద గత మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ కూడా జాప్యం జరగడంతో గత్యంతరం లేక ప్రియుడు మోహన్‌కుమార్‌ ఇంటి ఎదుట గత మూడు రోజులుగా న్యాయపోరాటం చేస్తుంది.

Related posts