telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆసీస్ స్పిన్నర్ కు గిఫ్ట్ ఇచ్చిన టీం ఇండియా…

ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌లో అదరగొట్టి అద్భుత విజయంతో పాటు సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ప్రత్యర్థి బౌలర్‌‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. భారత ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్‌కు బహుమతిగా అందించింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో భారత కెప్టెన్ అజింక్యా రహానే ఈ బహుమతిని లయన్‌కు అందజేశాడు. ఈ మ్యాచ్‌ లయన్‌కు 100వ టెస్ట్ కావడంతో ఈ విధంగా టీమిండియా సర్‌ప్రైజ్ చేసింది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సిరీస్‌లో సెంచరీ చేసే అవకాశం కోల్పోయిన రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ లయన్ చేతిలోనే ఔటయ్యారు. ఇలా క్రీడా స్పూర్తిని చాటడం రహానేకేం కొత్త కాదు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు సారథ్యం వహించిన రహానే.. విజయానంతరం ట్రోఫీతో ఫోటో‌కు ప్రత్యర్థిని కూడా ఆహ్వానించాడు. ఇక లయన్‌కు భారత ఆటగాళ్లు గిఫ్ట్ ఇవ్వడాన్ని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు.’మీ విజయం పట్ల వినయంగా ఉండటం మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. నాథన్ లయన్‌కు సంతకాలతో కూడిన జెర్సీని టీమిండియా బహుమతిగా ఇవ్వడం ఎంత కనువిందుగా ఉందో. అద్భుతం’అని పఠాన్ ట్వీట్ చేశాడు. వీవీఎస్ లక్ష్మణ్ కూడా భారత జట్టును, కెప్టెన్ రహానేను మెచ్చుకున్నాడు. భారత ఆటగాళ్ల క్రీడాస్పూర్తి పట్ల అభిమానులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Related posts