బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నార చోప్రా, సోనూ సూద్, తనికెళ్ల భరణి తదితరులు
దర్శకత్వం: తేజ
నిర్మాత: అనిల్ సుంకర, సుంకర రామబ్రహ్మం
సంగీతం: అనూప్ రూబెన్స్
“నేనే రాజు నేనే మంత్రి” సినిమాతో తిరిగి కమర్షియల్ హిట్ సాధించిన దర్శకుడు తేజ తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా “సీత” అనే సినిమా చేశారు. ఈ సినిమాలోని “సీత కాదు శూర్పణఖ” అనే డైలాగు క్లిక్ అయింది. “లక్ష్మీ కల్యాణం”, “నేనే రాజు నేనే మంత్రి” తర్వాత తేజ – కాజల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడవ సినిమా ఇది. టైటిల్ విషయంలో వివాదాలు రేగినప్పటికీ టైటిల్ మార్చనంటూ తేజ గట్టిగానే చెప్పారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సీత” చిత్రం ఎలా ఉందొ చూద్దాం.
కథ :
ఆనంద్ మోహన్ రంగ (భాగ్యరాజ్) మేనల్లుడు రఘురామ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్). మేనల్లుడిని భార్య పెట్టే బాధలు చూడలేక భూటాన్‌లోని బౌద్ధుల దగ్గర చేరుస్తాడు ఆనంద్. అక్కడే పెరిగిన రఘరామ్ ఈ లోకంలో ఉన్న కుళ్లు కుతంత్రాలకు దూరంగా పెరుగుతాడు. ఆనంద్ మోహన్ రంగ కూతురు సీత (కాజల్ అగర్వాల్). ఆమె మాత్రం డబ్బే ప్రధానంగా భావిస్తుంటుంది. పెద్ద హోటల్ కట్టాలని ఓ స్థలాన్ని కొంటుంది సీత. అక్కడుండే జనాలను తరిమేయడానికి ఎమ్మెల్యే బసవరాజ్ గౌడ్ (సోనూసూద్) సహాయం కోరుతుంది. సోనూసూద్ సీతపై కోరికతో ఒక నెలరోజుల పాటు తనతో గడిపితే తాను సహాయం చేస్తానంటాడు. దీనికి ఒప్పుకున్నా సీత సహజీవనం చేస్తానని అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేస్తుంది. బసవరాజు అక్కడి జనాల్ని తరిమేసిన తర్వాత అగ్రిమెంట్ గురించి పట్టించుకోదు. దాంతో బసవరాజు తన పొలిటికల్ పవర్‌ను ఉపయోగించి సీత బ్యాంకు అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నింటినీ సీజ్ చేస్తాడు. సీతపై చెక్ బౌన్స్ కేసు కూడా పెట్టిస్తాడు. దీంతో తండ్రిని డబ్బు అడుగుదామనుకుంటున్న సమయంలో ఆయన గుండెపోటుతో చనిపోతాడు. ఆ సమయంలో తండ్రి 5 వేల కోట్ల రూపాయల ఆస్థిని రఘురామ్ పేరుపై రాశాడని, అతన్ని పెళ్లి చేసుకుంటేనే ఆ డబ్బు తనకు సొంతమవుతుందని తెలుసుకుని భూటాన్‌లోని రఘురామ్‌ని కలుసుకుంటుంది సీత. రఘురామ్‌ని మోసం చేసి పేపర్స్‌పై సంతకాలు పెట్టించుకుని వదిలించుకోవాలని భావిస్తుంది. మరి రఘురామ్ ను ఆమె వదిలించుకోగలిగిందా ? బసవరాజు సీతను పొందడానికి ఏం చేస్తాడు ? సీతను రఘురామ్ ఎలా కాపాడుతాడు ? చివరికి ఏం జరిగింది ? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఫైట్స్, డ్యాన్సులతో కమర్షియల్ హీరోగా కన్పించాడు. కానీ ఈ సినిమాలో ఆయన సరికొత్త పాత్రలో నటించాడు. పాత్ర పరంగా అమాయకుడైన యువకుడిగా శ్రీనివాస్ తన శక్తి మేర చక్కగానే నటించాడు. కానీ ఇంకాస్త బెటర్‌గా చేస్తే బాగుండేది. ఇక కాజల్ అగర్వాల్ చుట్టూనే కథంతా తిరుగుతుంది. కేవలం డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే అమ్మాయిగా, తల పొగరుతో మాట్లాడే అమ్మాయి, అవసరం కోసం కాళ్లబేరానికి దిగే అమ్మాయిగా కాజల్ మంచి నటనతో మెప్పించింది. ఇక సినిమాలో బసవరాజు గౌడ్ అనే విలన్ పాత్రలో నటించిన సోనూసూద్ పాత్ర పరంగా సైలెంట్ విలనిజాన్ని అద్భుతంగా చూపించాడు. సన్నివేశాల ప్రకారం వచ్చే డైలాగ్స్‌కు సోనూసూద్ కరెక్టుగా సరిపోయాయి. ఇక మన్నారా చోప్రా, అభినవ్ గోమటం గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కోట శ్రీనివాసరావు, బిత్తరి సత్తి, అభిమన్యుసింగ్, మహేష్, భాగ్యరాజ్ తదితరులు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు తేజ తీసుకున్న కథను హీరోయిన్ యాంగిల్ లో చూపించాడు. ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. కానీ సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. అంగ్వాటికాలోని బౌద్ధాలయంలో తెలుగు సినిమా చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనూపర్ రూబెన్స్ సంగీతం, నేపథ్య సంగీతం ఫరవాలేదు. కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ సెకండాఫ్‌లో మరింత ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు ఫరవాలేదన్పించాయి.
రేటింగ్ : 2/5