telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి ముఖ్య నగరాల లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు.

ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచుల వినియోగాన్ని విరివిగా ప్రోత్సహించాలని సూచించారు.

మంగళవారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.

ప్లాస్టిక్ వ్యర్ధాల సమస్యను అధిగమించేందుకు 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ (ఆర్ఆర్ఆర్) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.

రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని, రీసైక్లింగ్ మరియు చెత్తను వేరు చేయడంపై 90 రోజుల్లోగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశించారు.

వ్యర్ధాల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకంగా వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛత’ అవార్డులను అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీలు, పాఠశాలలు-కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, ఎన్జీవోలు, వివిధ సంస్థల వారీగా ఈ అవార్డులను అందజేయాలని నిర్దేశించారు.

సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాలు వంటి 11 రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు.

వీటికి అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలను కూడా కలుపుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు.

Related posts