telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అను మాలిక్‌ పై మరో సింగర్ ఫైర్… సంచలన ఆరోపణలు

Neha

గతకొన్ని రోజులుగా మ్యూజిక్ కంపోజర్‌ అను మాలిక్‌పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు సోనా. సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్‌కు అను జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు ఈ షోకు సోనా కూడా జడ్జ్‌గా వ్యవహరించేవారు. అయితే తన కెరీర్ తొలినాళ్లలో అను తనను లైంగికంగా వేధించాడని సోనా ఏడాది క్రితం ఆరోపణలు చేశారు. దాంతో షో నిర్వాహకులు అనును తొలగించారు. కొంతకాలం తర్వాత సోనాను కూడా తొలగించారు. ఏడాది తర్వాత అనును మళ్లీ షోలోకి ఆహ్వానించి జడ్జ్‌గా కూర్చోబెట్టారు. దీనిపై అసహనం వ్యక్తం చేశారు సోనా. తాజాగా మ‌రో సింగ‌ర్ నేహా బాసిన్… అను మాలిక్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ అమ్మ‌డు లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ అనుమాలిక్‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా మండి ప‌డింది. ప‌లు లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అను మాలిక్‌ని ఇండియ‌న్ ఐడ‌ల్ ప్రోగ్రాం నుండి నిర్వాహ‌కులు తొలగించారు. టీఆర్పీ రేటింగ్ కోసం సెప్టెంబ‌ర్‌లో మ‌ళ్ళీ అత‌డిని న్యాయ నిర్ణేత‌గా తీసుకున్నారు. ఇది స‌రికాద‌ని సోన త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపింది. దీనికి నేహ మ‌ద్ద‌తిచ్చింది. “నేను నీతో ఏకీభవిస్తున్నాను. లింగవివక్ష కలిగిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఈ ప్ర‌పంచంలో అను మాలిక్‌ ఒక దిగజారుడు వ్యక్తి. 21 ఏళ్ల వయస్సులో నేను అతడి వికృత చర్యల నుంచి తప్పించుకుని పారిపోయాను. ఓ రోజు స్టూడియోకు వెళ్లిన సమయంలో సోఫా మీద పడుకుని ఎదురుగా నన్ను కూర్చోమంటూ నా కళ్ల గురించి వర్ణించడం మొదలుపెట్టాడు. అయితే నేను మాత్రం వెంటనే విషయాన్ని పసిగట్టి కింద అమ్మ ఎదురుచూస్తోంది అని అబద్ధం చెప్పి అతడి నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత కూడా అతడు నాకు మెసేజ్‌లు, కాల్స్‌ చేసి విసిగించేవాడు. కానీ నేను మాత్రం వాటికి స్పందించకుండా మిన్నకుండిపోయాను. అతడు ఒక క్రూర జంతువు” అని పేర్కొన్నారు. నేహా బాసిన్ సింగ‌ర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగులో నువ్వే ఇటు నువ్వే(కరెంట్‌), నిహారికా నిహారికా(ఊసరవెళ్లి), స్వింగ్‌ జరా(జై లవ కుశ) తదితర పాటలు పాడి టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించింది.

Related posts