కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం పై దేశ వ్యాప్తంగా ఆపార్టీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా జ్యోతిరాదిత్య సింధియాను నియమించాలని మధ్య ప్రదేశ్ పీసీసీ కార్యాలయం వద్ద పోస్టర్లు వెలిశాయి తదుపరి అధ్యక్షుడిగా సింధియాను ప్రకటించాలని ఆయన మద్దతు దారులు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి సింధియా రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ పోస్టర్లు దర్శనమివ్వడం గమనార్హం. “దేశానికి గర్వకారణమైన వ్యక్తి, సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ అధ్యక్షడిగా నియమించాలని రాహుల్ గాంధీని విజ్ఞప్తి చేస్తున్నాం.” అని సదరు పోస్టర్లో సింధియా మద్దతుదారులు రాశారు. మధ్య ప్రదేశ్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలందరి తరపున ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.