telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ : .. టైటిల్ గెలిచిన సింధు.. ప్రముఖుల ప్రశంసలు..

sindhu won world badminton championship

గతంలో రెండు సార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గడంలో విఫలమైన తెలుగుతేజం పీవీ సింధు మూడో ప్రయత్నంలో విజయకేతనం ఎగురవేసింది. స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సింధు విజేతగా అవతరించింది. ఇవాళ జరిగిన ఫైనల్లో జపాన్ అమ్మాయి నజోమీ ఒకుహరపై వరుస గేముల్లో గెలిచింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో సింధు 21-7, 21-7తో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది.

సింధు విజయంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యావత్ భారతదేశానికి ఇది గర్వించదగ్గ సమయం అంటూ కోవింద్ పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ కోర్టులో నీ మాయాజాలం, కఠోర శ్రమ కోట్లాది మందిని ఉర్రూతలూగించడమే కాదు, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సింధు ప్రతిభను బ్రహ్మాండం అంటూ అభివర్ణించారు. ఆట పట్ల ఆమె అనురక్తి ప్రశంసనీయం అంటూ కొనియాడారు. తర్వాతి తరాల ఆటగాళ్లకు సింధు విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిష్ విజేతగా అవతరించి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఎవరి ప్రతిభనైనా పొగిడేందుకు ఆకాశమే హద్దు అంటారు, కానీ నీ ప్రతిభకు ఆకాశం కూడా హద్దు కాదు తల్లీ.. అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

సింధూ శుభాభినందనలు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పసిడి పతకం నెగ్గిన తొలి భారత షట్లర్ గా అవతరించింనందుకు కంగ్రాట్స్. ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించడమే కాకుండా, సిసలైన చాంపియన్ లా మ్యాచ్ ను ముగించావు” అంటూ జగన్ ట్వీట్ చేశారు.

టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా పీవీ సింధు ఘనత పట్ల స్పందించారు. పీవీ సింధు నువ్వు తిరుగులేని విజేతవు అంటూ ట్వీట్ చేశారు. “ఫైనల్లో నజోమీ ఒకుహరపై విజయం సాధించినందుకు శుభాభినందనలు. ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యం చూపించావు. నిజంగా గర్విస్తున్నాం సింధూ” అంటూ అభినందించారు.

Related posts