telugu navyamedia
సామాజిక

సింధు పుష్కర్ వైభవం..

తుంగ భద్ర పుష్కరాలు పూర్తయ్యాయి. నవంబర్ 20, 2020 తేదీతో పూర్తయిన తుంగభద్ర నదీ వైభవాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుని…సింధూ నదీ పుష్కరాల వైపు అడుగులు వేద్దాం. గంగా స్నానం, తుంగా పానం అనేది నానుడి. అంటే..తుంగభద్రా నదీ జలాలు అంత స్వచ్ఛమైనవని సాక్షాత్తు నదీమతల్లుల గాధలే చెబుతున్నాయి.

తుంగభద్ర…ఇదేం పెద్ద నదుల్లో లెక్కకాదు. కృష్ణా నదికి ఉపనది. ఉప నది అయివుండి…పెద్ద నదులతో సమానంగా…పుష్కరాల్లో స్థానం సంపాదించింది. ఎన్నో పెద్ద నదులున్నా.. కేవలం 12 నదులకు మాత్రమే పుష్కరార్హత కల్గిస్తే..ఇందులో తుంగభద్ర స్థానం పొందింది. కృష్ణా నది ఉప నదిగా వున్న తుంగభద్ర, కృష్ణ నదిలో కలిసి ప్రయాణం సాగిస్తుంది. అయితే..ఒక ప్రాంతంలో కృష్ణమ్మ నుంచి విడివడి…స్వయం ప్రయాణం సాగిస్తుంది. అలా…స్వీయ నదీ ప్రవాహంగా సాగి…తిరిగి కృష్ణ నదిలో కలుస్తుంది. అలా..కృష్ణా నదిలో కలిసి…హంసలదీవి ప్రాంతంలో సాగర సంగమం చేస్తుంది. ఇక తాజా నదీ పుష్కారాలైన సింధు విషయంలోకి వద్దాం.

సింధు..రెండక్షరాలు… ఈ రెండు ఆరంభ సంఖ్య ప్రామాణికంతోనే సింధు నది పుష్కరాలు ఆరంభం అయ్యాయి. 21 నవంబర్ 2021 నుంచి ప్రారంభమైన సింధూ నది పుష్కరాలు 2 డిసెంబర్ 2021 వరకు జరగనున్నాయి.

పంచభూతాల్లో విశిష్ట స్థానం వున్న జలాలు…సర్వప్రాణికోటికి ప్రాణాధారం. దాహార్తి తీర్చుకోవడానికైనా, దేహ స్నాన ప్రక్రియకైనా, పంటలు పండడానికైనా, వండే వంటలకైనా…ఎందుకైనా జలం ఉండితీరాల్సిందే. జలరహిత జీవనం..అనే ఊహే, ఎంతో భయోత్పాతం, గగుర్పాటు కల్గిస్తుంది. భారతావని సనాతన ధర్మం జలాలకు పవిత్ర స్థానం ఇచ్చింది. దైవ పూజల్లో ఆచమనమే కాదు, పిత్రుదేవతల తర్పణాల్లో ఖచ్చితంగా కావల్సింది జలమే.

Sind River - Wikipedia

పరోపకారాయ ఫలంతి వృక్షా: పరోపకారాయ వహన్తి నద్య:..ఇతరుల ఉపకారం కోసమే చెట్లు పళ్లను ఇస్తున్నాయి కాని ఆ తరువులు, ఆ ఫలాలను భుజించడం లేదు. అదే రీతిలో నదులు నీళ్లు మనకు ఇస్తున్నాయి కాని ఆ నీళ్లను నదులు తాగడం లేదు. అంతటి వృక్షరాజాలు, నదీమ తల్లుల పై మనం ఎంత కృతజ్నత కలిగివుండాలి. భారతావనిలో ఎన్నోపుణ్య నదీ మాతలు ఉన్నాయి. అయితే, ఈ నదీమ తల్లుల్లో అగ్రశ్రేణి నదీమ తల్లులుగా 12 నదులను గుర్తించి, ఈ నదులు పుష్కరార్హత నదులుగా భారతీయ సనాతాన సంప్రదాయం, పురాణేతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు, మునిపుంగవులు, పండిత శ్రేష్ణులు నిర్ణయించారు. ఒక్కో నదీమ తల్లికి ఒక్కో పవిత్ర పుణ్యగాథ ఉంది.

ఏ నదికి పుష్కరాలు వస్తాయో…ఆ నది చెంతకు సమస్త దైవాలు, సర్వదేవతలు వస్తారని, 12 రోజులపాటు ఆ నదులను అమృతతుల్యం చేస్తారని వేదాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. పుష్కరాల సమయంలో స్నానం చేస్తే లభించే పుణ్యఫలం అపారమని, ఇహ, పర సౌక్యాలు సిద్ధిస్తాయని సర్వ శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. పుష్కర స్నానం ఆధ్యాత్మిక జీవశక్తికి సోపానంగా పెద్దలు అభివర్ణిస్తారు.

పుష్కరుడు..ఒక్కో నదిలో ఏడాది చొప్పున 12 పుణ్య నదుల్లో కొలువైవుంటాడు. ఇప్పుడు సింధు నదిలో పుష్కర ప్రవేశం జరగడంతో, ఈ నదికి పుష్కరాలు వచ్చాయి. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధు నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యి..సింధు నది పుష్కరాలు విజయవంతంగా సాగుతున్నాయి.

దేవతా స్వరూపాలుగా భాసిల్లేవి నదీ నదాలు. నారం అంటే జలం, నార నివాసి అయిన మహావిష్ణువు నారాయణుడిగా కీర్తిపొందాడు. ఇక ఆదిదేవుడైన పరమ శివుడు అభిషేక ప్రియుడు. సాధారణ సమయంలో నదీ జలాలతో చేసే అభిషేకాలకే వరాలొసగే బోళా శంకరుడు…ఇక పుష్కర సమయంలో భక్తులు చేసే పుణ్యస్నానాలకు, శివాభిషేకాలకు ఎంత వరాల వరద కురిపిస్తాడో చెప్పాల్సిన పని ఏముంది.

సింధు నాగరికత..ఇండస్ వేలీ సివిలైజేషన్ అంటారు. అంతటి విశిష్ట పేరున్న సింధూ నది, యావత్ భారతావనిలోనే ప్రసిద్ధమైన హిమగిరి నది. హిమాలయ పర్వతాల్లో పుట్టి..టిబెట్, కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాల్లో పరవళ్లు తొక్కి…పాకిస్థాన్ కరాచీ వద్ద వున్న అరేబియా మహాసముద్రంలో అంతర్లీనం అవుతుంది. సింధూ నది పుష్కరాలకు..దేశం నలుమూలల నుంచి భక్తులు..సింధూ ప్రవాహ ప్రాంతాలకు ఉత్సాహంగా తరలివెళుతున్నారు.

Related posts