telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

50 ఏళ్ళ రికార్డును బద్దలుకొట్టిన గిల్…

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా ఆటగాళ్ల రికార్డుల మోత మోగించారు. యువ ఓపెన‌ర్ శుభ‌మన్ గిల్ మ‌రో అరుదైన రికార్డును త‌న పేరిట రాసుకున్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 9 ప‌రుగుల తేడాలో సెంచరీ మిస్ అయినా.. 50 ఏళ్ల కింద‌టి ఓ రికార్డును గిల్ తిర‌గ‌రాశాడు. ఓ టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన అత్యంత పిన్న వ‌య‌సు ఇండియ‌న్ ఓపెన‌ర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. గిల్ ప్ర‌స్తుత వ‌య‌సు 21 ఏళ్ల 133 రోజులుగా ఉంది. గ‌తంలో నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన అత్యంత పిన్న వ‌య‌సు రికార్డు టీమిండియా లెజెండ‌రీ బ్యాట్స్‌మ‌న్ సునీల్ గ‌వాస్క‌ర్ పేరిట ఉంది. సన్నీ 1970-71లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో 67 ప‌రుగులు చేశాడు. లిటిల్ మాస్టర్ అదే టెస్ట్ ద్వారా ఆరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌తోనే టెస్ట్ అరంగేట్రం చేసిన శుభ‌మన్ గిల్‌.. అద్భుతంగా ఆడుతున్నాడు. మెల్‌బోర్న్‌లో జ‌రిగిన రెండో టెస్ట్‌లో 45, 35 ప‌రుగులు చేసిన గిల్‌.. సిడ్నీలో తొలి హాఫ్ సెంచ‌రీ చేశాడు.

బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లోనే 21 ఏళ్ల శుభ్‌మన్‌ గిల్‌ టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మూడో టెస్టు ఆడుతున్న గిల్‌ని భయపెట్టేందుకు ఆసీస్ స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్ గంటకి సుమారు 140 కిమీ పైగా వేగంతో పదేపదే షార్ట్ పిచ్ బంతుల్ని సంధించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని గిల్.. షార్ట్ పిచ్ బంతులకి తనదైన శైలిలో బదులిచ్ఛాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో అతను కొట్టిన ప్లాట్ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో రహానే సేన ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్ధేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ భారత్ 2-1తో కైవసం చేసుకుంది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ ‌అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్​ గిల్‌, నయావాల్ ఛెతేశ్వర్‌ పుజారా‌ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో కెప్టెన్ అజింక్య రహానే చరిత్రను తిరగరాశాడు. తాను సారథ్యం వహించిన ఏ టెస్టులోనూ భారత్ ఓడిపోలేదు.

Related posts