telugu navyamedia
క్రీడలు వార్తలు

మైదానంలో ఎలా ఆడాలో ఆ ఇద్దరు చెప్పారు : గిల్

గతేడాది చివర్లో ఆస్ట్రేలియా జరిగిన టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్‌గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 91 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలా చారిత్రాత్మక సిరీస్‌ విజయంలో భాగమైన గిల్‌ ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ పాల్గొన్నాడు. అయితే ఆ సిరీస్‌లో గిల్‌ అంచనాలను అందుకోలేకపోయాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ విఫలమయ్యాడు. అయినా గిల్ ఆటపై నమ్మకముంచిన బీసీసీఐ కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో తాజాగామాట్లాడిన గిల్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘విరాట్ కోహ్లీతో ఎప్పుడు మాట్లాడినా.. బెరుకు లేకుండా ఎలా ఆడాలో చెప్తుంటాడు. అలానే బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండాలని సూచించేవాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఎలా ఆడాలో నేర్పిస్తుంటాడు. మైదానంలో తెగించి ఆడాల్సిన సందర్భాల్ని కూడా రోహిత్ శర్మ గుర్తు చేసేవాడు. ప్రత్యర్థి బౌలర్లు ఏ ప్రదేశంలో ఎక్కువ బంతులు వేస్తున్నారు..? అనే దానిపై రోహిత్ శర్మ ఎక్కువగా మైదానంలో మాట్లాడుతుండేవాడు’అని చెప్పుకొచ్చాడు.

Related posts