telugu navyamedia
రాజకీయ వార్తలు

చంద్రబాబుతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా?

uddhav-thackeray-shivasena

మహారాష్ట్ర రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో గవర్నర్ సిఫార్సుతో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్-ఎన్‌సీపీ, శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను తమకు రెండు రోజులు సమయం ఇవ్వమంటే నిరాకరించారని, రాష్ట్రపతి పాలనతో ఇప్పుడు ఆరు నెలలు గడువు ఇచ్చారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు కలిసి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయని మీడియా అడిగిన ప్రశ్నకు శివసేన అధినేత ఆసక్తికర సమాధానం ఇచ్చారు. వేర్వేరు భావజాలాలు కలిగిన చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్, మెహబూబా ముఫ్తీ లాంటి వారితో కలిసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది కదా అని గుర్తుచేశారు.

కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం అదనపు సమయం ఇవ్వడానికి గవర్నర్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై తాజా పరిణామాల దృష్ట్యా శివసేన వెనక్కి తగ్గింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ కోరట్లేదని ఆ పార్టీ తరఫు లాయర్ సునీల్‌ ఫెర్నాండెజ్‌ తెలిపారు. మంగళవారం నాటి పిటిషన్‌పై అత్యవసర విచారణ కూడా కోరట్లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ నుంచి మద్దతు లభించిన తర్వాతే కొత్త పిటిషన్‌ దాఖలు చేస్తామని అన్నారు.

Related posts