telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్ సేవ‌లపై శిల్పాశెట్టి కుమారుడి వీడియో

Shilpa

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. లాక్ డౌన్ సమయంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు. దీంతో సోనూసూద్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోన్న విష‌యం తెలిసిందే. చిన్నారులు కూడా ఆయ‌న‌ను రియ‌ల్ హీరో, సూప‌ర్ మా‌న్ అంటున్నారు. సినీన‌టి శిల్పాశెట్టి కుమారుడు వియాన్ (8) కూడా సోనూసూద్ చేస్తోన్న‌ సేవ‌ల ప‌ట్ల ఆకర్షితుడ‌య్యాడు. తన స్కూల్‌ ప్రాజెక్ట్‌ కోసం ఓ యానిమేటెడ్‌ వీడియోను వియాన్‌ రూపొందించాడు. అందులో సోనూసూద్ హీరో.. ఆయ‌న చేసిన సేవ‌ల‌ను వియాన్ చూపించాడు. దాన్ని చూసిన శిల్పాశెట్టి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. స‌మాజంలో జ‌రిగే ప్రతి విషయాన్నీ చిన్నారులు కూడా గమనిస్తుంటారని, స్కూల్‌ ప్రాజెక్ట్‌ కోసం త‌న కుమారుడు వియాన్‌ చేసిన యానిమేటెడ్‌ వీడియో చూసి తాను చాలా హ్యాపీగా ఫీలయ్యాన‌ని చెప్పింది. వలస కార్మికుల కోసం సోను చేసిన సేవలు వియాన్ హృదయాన్ని తాకాయని చెప్పింది. వియాన్ సొంతంగా కథ రాసుకుని, డబ్బింగ్‌ చెప్పుకుని, ఎడిటింగ్‌ కూడా చేశాడని తెలిపింది. వియాన్ వర్క్‌ చూసి గర్వంగా భావిస్తున్నాన‌ని చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts