ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, ఓమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ తదితరులు సంతాపం తెలిపారు.
షీలా దీక్షిత్ మృతి దేశానికి తీరని లోటని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దిల్లీకి సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆమె పేరుపొందారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రియమైన నేత షీలా దీక్షిత్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలోచికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.