telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాటి నుంచి నేటి వరకు… విజయ నిర్మల ప్రస్థానం

Vijaya-Nirmala-1

టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి చెందారు. విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్‌కు తరలిస్తారు. శుక్రవారం మ‌హా ప్ర‌స్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి.

హీరోయిన్ గా నటిస్తూ డైరెక్షన్ చేసి సొంతంగా నిర్మించి ఘన విజయాలు సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల గారు. మీనా, కవిత, రౌడీ రంగమ్మ, కలెక్టర్ విజయ, పిన్ని, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి చిత్రాలు అందుకు సాక్ష్యాలు. నటసామ్రాట్ ANR, నడిగర్ తిలకం శివాజి గణేశన్, సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి హేమాహేమీల్ని డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయనిర్మల గారు. బాలనటిగా తెలుగు సినీరంగంలో ప్రవేశించి ఉన్నతశిఖరాలు అధిరోహించారు. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు సహా ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. అత్యధిక సినిమాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల. తెలుగు సినీ రంగంలో మహిళల ప్రాధాన్యతను పెంచారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారు.

విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించారు. విజయనిర్మల తండ్రి స్వస్థలం చెన్నై, తల్లి స్వస్థలం నరసారావుపేట. తన ఏడో ఏటనే తమిళంలో “మత్స్యరేఖ” అనే సినిమాతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. అలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పదకొండేళ్ల వయసులో “పాండురంగ మహత్యం”లో నటించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో 200కుపైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. ఇందులో సూపర్‌స్టార్ కృష్ణతోనే 47 చిత్రాలు చేశారు. హీరోయిన్‌గా నటించిన తన తొలి చిత్రం “రంగులరాట్నం”కు నంది పురస్కారం అందుకున్నారు.

బాలనటి, నటిగా మెప్పించిన విజయనిర్మల నిర్మాతగా విజయకృష్ణ పతాకం అనే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి 15కుపైగా చిత్రాలను నిర్మించారు. 1971లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. “మీనా” అనే సినిమాతో దర్శకత్వం మొదలుపెట్టిన ఆమె 44 చిత్రాల వరకు దర్శకురాలిగా కొనసాగారు. 1971 నుంచి 2009 వరకు దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.

నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విజయనిర్మల ఎన్నో అవార్డులను అందుకున్నారు. అందులో ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకుగానూ ఇచ్చే అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును ఆమె 2008లో అందుకున్నారు. అలాగే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నారు. ఈ రికార్డు ఇప్పటి వరకు ఆమె పేరు మీదే ఉండడం విశేషం. వెండితెరపైనే కాదు “పెళ్లి కానుక” సీరియల్‌తో విజయనిర్మల బుల్లితెరపైనా మెప్పించారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. కృష్ణ – విజయనిర్మల వివాహబంధానికి సాక్షి చిత్రమే కారణం. తిరుపతిలో కృష్ణను విజయనిర్మల వివాహం చేసుకుంది. కృష్ణతో వివాహం అయ్యాక నటించిన చిత్రం “అమ్మకోసం”. ఆమెకు ప్రముఖ నటుడు నరేష్ ఒక్కరే సంతానం. ఆయన ప్రస్తుతం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

Related posts