సీనియర్ నటుడు ఉత్తేజ్ తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1989లో శివ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి అదే సినిమాలో ఓ పాత్రలో నటించారు. ఆ తరువాత సొంతంగా ఓ నటశిక్షణ సంస్థను స్థాపించి ఔత్సాహిక నటీనటులకు నటనలో మెళకువలు నేర్పిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలో వారసత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా కాలంగా చూస్తున్నామని, నాగార్జున కాలం నుండి చూస్తూనే ఉన్నామని, అయితే నటవారసులకు ఒకట్రెండు ఛాన్స్ లు మాత్రమే ఉంటాయని అన్నారు. అప్పటికి నిరూపించుకోకపోతే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నామని అన్నారు. హీరోల వారసులకు తమను తాము నిరూపించుకునే అవకాశం సులభంగా వస్తుంది. అవకాశాలు సులభంగా దక్కుతాయి. కానీ వారు నిరూపించుకోలేకపోతే.. మాత్రం వారు తెరమరుగు కావడం ఖాయమని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ప్రవేశించిన రామ్ చరణ్ ఎంతో ప్రొఫెషనల్ గా ఉంటారని, అది తండ్రి నుండి వచ్చిన క్వాలిటీ అని అన్నారు. అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు తనను తాను ఉలి వేసి చెక్కుకున్నాడని ప్రశంసించారు. రవితేజ పక్కింటబ్బాయిలా నటిస్తాడని, నాని రియలిస్టిక్ గా నటిస్తాడని అన్నారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెబుతూ… అతడిలో యాక్టర్ కనిపిస్తాడని, స్టార్ డంతో పాటు వృత్తినిబద్దత ఉన్న యాక్టర్ తనలో ఉంటాడని, సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ వచ్చి ఆయన ఉండిపోయిందేమో అనిపిస్తుందని అన్నారు.