telugu navyamedia
క్రీడలు వార్తలు

నటరాజన్-బుమ్రా మధ్య పోలికలు ఇవే…

‘టీ. నటరాజన్’.. ఐపీఎల్ 2020 సీజన్ వరకు పెద్దగా ఎవరీకి తెలియని పేరు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్ క్యాష్‌రిచ్ లీగ్‌లో రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా కట్టుదిట్టమైన యార్కర్లతో ఆకట్టుకున్నాడు. అంతేనా.. భారత క్రికెట్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అనూహ్యంగా వచ్చిన ఈ అవకాశాన్ని కూడా రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. వరుస పరాజయాలతో చతికిలపడ్డ భారత జట్టుకు అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టి ఓదార్పు విజయాన్నందించాడు. ఆ వెంటనే టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇక్కడా ప్రత్యర్థి పనిపట్టి గెలిపించాడు. దీంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక కాకతాళీయమో లేక నటరాజన్ అదృష్టమో కానీ.. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తరహాలోనే ఈ సన్‌రైజర్స్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బుమ్రా, నట్టూ మధ్య ఉన్న ఈ ఆసక్తికరమైన పోలికను సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

‘జస్‌ప్రీత్ బుమ్రా, నటరాజన్ మధ్య చోటు చేసుకున్న ఈ కోఇన్సిడెన్స్ అద్భుతం. ఈ ఇద్దరూ ఆటగాళ్లు జట్టులోని మరో ప్లేయర్ గాయపడటంతోనే అవకాశం దక్కించుకున్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా గడ్డపైనే టీ20, వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా వన్డే సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకున్నారు. ఇద్దరూ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. పైగా రెండు సందర్భాల్లోనూ అంతకుముందు ఓడిన భారత్ వీరు ఆడిన మ్యాచ్‌ల్లో గెలిచింది. అరంగేట్ర టీ20 మ్యాచ్‌ల్లోనూ ఇద్దరూ మూడు వికెట్లు తీశారు. నట్టూ బుమ్రాలానే ప్రభావవంతమైన బౌలింగ్‌ను కొనసాగిస్తే భారత జట్టుకు తిరుగుండదు.’అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ ప్రదర్శనే టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. మరే ఇతర బౌలర్ సాధ్యం కానీ విధంగా ఈ సీజన్‌లో నటరాజన్ సుమారు 65 యార్కర్లు వేసాడు. దాంతోనే తన పేరును యార్కర్ల నట్టూగా మార్చుకున్నాడు. ఇంతగా రాణించిన అతనికి భారత జట్టులోకి నేరుగా అవకాశం దక్కలేదు. ఫస్ట్ నెట్ బౌలర్‌గా.. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో టీ20లకు.. సైనీ గాయంతో వన్డేలో బ్యాకప్‌గా అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌ల్లోనే వికెట్లు తీసి.. జట్టులో కీలక బౌలర్‌గా నిలిచాడు.

Related posts