telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణలో విద్యాసంస్థల పునఃప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్ వాడీలు సహా అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పునః ప్రారంభించబోతున్నారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను పునః ప్రారంభించే అంశంపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఈ నెల 30 లోగా శానిటైజేషన్ పూర్తిచేయాలని పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కరోనా కారణంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సహా ప్రైవేట్ స్కూల్ టీచర్లు తదితర విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పునః ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను కూడా సమావేశంలో క్షుణ్ణంగా చర్చించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితుల పై రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో చర్చించాం. గతం కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా జన సంచారం మామూలు స్థాయిలోకి వస్తున్నది. అదే సందర్భంలో విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్ధినీ విద్యార్థుల్లో ముఖ్యంగా స్కూలు పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నదని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి వున్నదనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్రంలో కేజి నుంచి పీజీ దాకా, ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని రకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని, అన్ని రకాల పూర్వాపరాలు పరిశీలించిన మీదట, సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను తీసుకుని, పలు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాల విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నద‌ని అని సీఎం కేసిఆర్ తెలిపారు.

Related posts