telugu navyamedia
విద్యా వార్తలు

విద్యా సంస్థలు ప్రారంభించవచ్చు: వైద్యశాఖ

విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమేనని వైద్యశాఖ పేర్కొంది. విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధికులు ఇప్పటికే టీకా పొంది ఉన్నారని తెలిపింది. తల్లిదండ్రుల్లోనూ ఎక్కువ మంది కనీసం ఒక డోసైనా తీసుకున్నట్టు వివరించింది. కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలు, కళాశాలలను నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. ఈ మేరకు విద్యాశాఖకు ఇటీవల సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపినట్లుగా వైద్యవర్గాలు పేర్కొన్నాయి. విద్యాశాఖ లిఖితపూర్వకంగా అభిప్రాయాన్ని కోరకపోవడంతో.. తాము కూడా అడిగిన సందేహాలను మౌఖికంగానే నివృత్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై ఉన్నతస్థాయిలో సమావేశం జరిగే అవకాశాలున్నాయనీ, అందులో విద్యాసంస్థలను ప్రారంభించడంపై మరింత స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటారని పేర్కొన్నారు.

దాదాపు ఏడాదిన్నరగా బడికి, కళాశాలలకు దూరంగా ఉంటున్న పలువురు విద్యార్థుల్లో తెలియకుండానే మానసిక సమస్యలు పెరిగిపోయాయనీ, ఆ ప్రభావం తల్లిదండ్రులపైనా పడుతోందని వైద్యవర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌ విద్య వల్ల విద్యార్థుల మనోవికాసం దెబ్బతింటోందనీ, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లతోనే అస్తమానం కాలం గడుపుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. విద్యసంస్థలు తెరిచిన తరువాత తగిన జాగ్రత్తలు పాటించాలి అని వైద్య శాఖ విద్యాశాఖకు సూచించినట్లు తెలిసింది.

Related posts