పాఠశాల బస్సుకు పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారులతో స్కూలుకు వెళుతున్న ఓ పాఠశాల బస్సు అదపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా, మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. వీరికి ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం ఇళ్లకు పంపించివేశారు. నరసాపురంలోని వశిష్టా స్కూలుకు చెందిన బస్సు ఈరోజు పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వస్తోంది.
ఈ క్రమంలో మార్గమధ్యంలో అదుపుతప్పిన బస్సు పంటకాలువలోకి దూసుకెళ్లింది. దీనితో భయపడిపోయిన చిన్నారులు కేకలు వేశారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే చిన్నారులను బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.