బాలీవుడు ప్రముఖ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, నాలుగో స్టేజ్‌లో ఉందని ఇటీవలే వెల్లడైన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ వార్తలు బాలీవుడ్‌లో కలకలం రేపాయి. సంజయ్‌దత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రార్ధించారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై భార్య మాన్యత ఓ ప్రకటన విడుదల చేశారు. సంజయ్ దత్ కేవలం తన పిల్లలకు మాత్రమే కాకుండా, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మొత్తం కుటుంబానికే ఓ తండ్రిలా కాపుకాశాడని, ఆయనకు కేన్సర్ అని తెలిసిన వెంటనే కుటుంబం మొత్తం కదలిపోయిందని మాన్యత తెలిపారు. దీంతో అందరం కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని, అభిమానుల ప్రార్థనలు, దేవుడి ఆశీస్సులతో ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడతామని మాన్యత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయాన్ని విజయవంతంగా అధిగమించేందుకు అందరి సహకారం కావాలని కోరారు. గతంలో ఎన్నో ఇబ్బందుల నుంచి తమ కుటుంబం బయటపడిందని, ప్రస్తుత పరిస్థితిని కూడా అధిగమిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దయచేసి ఎవరూ పుకార్లను నమ్మవద్దని, సంజయ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటామని పేర్కొన్నారు మాన్యత.