telugu navyamedia
రాజకీయ

పంజాబ్‌లో లోక్‌సభ ఉపఎన్నికలో ఆప్‌కు బిగ్‌ షాక్‌..

పంజాబ్‌లో ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ పరాజయం చవి చూసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆ పార్టీ నేత భగవంత్ మాన్ ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని కోల్పోయింది.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కొద్ది గంటలపాటు జరిగిన హోరాహోరీ పోరాటంలో శిరోమణి అకాలీదళ్-అమృత్‌సర్ పార్టీ విజయ ఢంకా మోగించింది.

శిరోమణి అకాలీ దళ్ (అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రన్‌జిత్ సింగ్ మాన్‌పై చేతిలో ఆప్ అభ్యర్థి గుర్మయిల్ సింగ్ సుమారు 7000 ఓట్లతో తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దల్వీర్ సింగ్, బీజేపీ అభ్యర్థిగా కేవల్ ధిల్లాన్ పోటీ చేశారు. ధిల్లాన్ జూన్ 4న బీజేపీలో చేరారు.

ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో సీఎంగా భగవంత్‌ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టడంతో ఆయ‌న గెలుపొందిన సంగ్రూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో సంగ్రూర్ లోక్‌స‌భ‌ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

సంగ్రూర్ రీజియన్ ఆప్‌కు కంచుకోట వంటిది. ఈ పార్లమెంటరీ స్థానంలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుచుకుంది. భగవంత్ మాన్ ఈ పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు గెలిచాడు. 2014, 2019లలో ఈ స్థానాల్లో లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందాడు.

గాయకుడు, రాజకీయ నేత సిద్ధూ మూసే వాలా హత్యానంతరం ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉందని అనేక మంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి.

తాజాగా, ఈ సంగ్రూర్ పార్లమెంటు స్థానంలో ఆప్ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది.

 

Related posts