telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇసుక వారోత్సవాలు.. డిమాండ్ కు మించి నిల్వలకు ప్రణాళికలు..

apcm jagan new policies on sand mafia

అధికారులు జిల్లాలో ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టారు. పుష్కలమైన ఇసుక నిల్వలు ఉన్నాయని, వాటిని లబ్ధిదారులకు అందిచే లక్ష్యంతో పని చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా రోజుకు 20వేల టన్నుల ఇసుక డిమాండ్‌ ఉండగా మంగళవారం 20,204 టన్నుల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందులో ప్రధానంగా కొత్త రీచ్‌లను గుర్తించడం, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు పరిశీలన అనుమతులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం మైనింగ్‌ శాఖ పరిధిలో తొమ్మిది కొత్త ఇసుకరీచ్‌లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో బాపట్లలో ఓలేరు రీచ్, భట్టిప్రోలు మండలంలో తూర్పుపాలెం, దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరుల నాలుగు ఇసుకరీచ్‌ల అనుమతులు కోసం మైనింగ్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలోని 19 ఇసుక రీచ్‌లు, 5 పట్టా భూముల్లో 14.49 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతులు తీసుకున్నారు.

ఇప్పటికే గాజులంక, బొమ్మువానిపాలెం, మున్నంగి, తాడేపల్లి, బత్తినపాడు (కృష్ణాజిల్లా), దిడుగు, కొంగంటివారిపాలెం, నవ్వులూరు, పెదకాకాని, చౌడవరంలో స్టాకు యార్డులు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా కొత్తగా మరో నాలుగు స్టాకు యార్డులు బాపట్ల, వినుకొండ, పిడుగురాళ్ల, నరసరావుపేటలో ఏర్పాటు చేయనున్నారు. ఇసుక లభ్యతను మరింత పెంచేందుకు వీలుగా 125 పట్టాభూముల్లోనూ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇసుక వినియోగదారులకు పారదర్శకంగా అందేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలను తీసుకొంటోంది. కృష్ణా నదికి వరద తగ్గుముఖం పట్టడంతో, రీచ్‌లలో వీలైనంత ఎక్కువగా తవ్వకాలు జరిపేందుకు కల్టెకర్‌ ఐ.శామ్యూల్‌ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో కసరత్తు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఇసుక రీచ్‌ల నుంచి 11,600 టన్నుల ఇసుక తవ్వకాలు నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో స్టాకు ఉన్న, ఎన్‌సీసీ, ఎల్‌అండ్‌టీ వద్ద ఇసుల నిల్వల నుంచి ఇసుకను వినియోగదారులకు కేటాయిస్తున్నారు.

Related posts