telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

నెల్లూరులో ఇసుక మాఫియా.. పెద్దల అండతో.. అధికారుల అలసత్వం.. !!

sand mafia in nellore in huge way

నెల్లూరు జిల్లాలో ఎంత నిలువరిద్దామన్నా కూడా ఇసుకాసురులు మళ్లీ..మళ్లీ బరి తెగిస్తున్నారని.. వారి దందాలు ఆగడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు చర్యలకు ఉపక్రమించేలోపే నదీ గర్భాలను తోడేస్తున్నారు. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం, రాముడుపాలెం, పల్లిపాడు, నేడుముసలి, పలు ప్రాంతాల నుంచి ఇటీవల కాలంలో ఇసుకను తరలించేవారు. నిబంధనలకు మించి ఇసుకను తోడేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అధికారులు సైతం స్పందించి ఇసుక అక్రమార్కులను తరిమికొట్టారు. దీనితో ఆయా ప్రాంతాలలో ఇసుక రవాణా కాస్త సన్నగిల్లింది.

నూతనంగా రూరల్‌ మండలానికి చెందిన కోడూరుపాడు గ్రామ ప్రజలకు ఆ గ్రామం గుండా ప్రయాణ సౌకర్యాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆరోపణలతో పెన్నా నది ఒడ్డున గ్రామానికి ఆనుకొని నూతన తారురోడ్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామం గుండా ప్రయాణించి ఊరు బయట నుండి ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, పలు వాహనాలు ప్రయాణం చేసే విధంగా ఏర్పాటు చేశారు. పెన్నా నది ఒడ్డు పక్కనే తారు రోడ్డు ఉండటంతో ఇసుకాసురులకు ఇసుకను దొంగిలించడానికి చాలా సులువయ్యింది. ఆ రోడ్డు గుండా ట్రాక్టర్లలో ఇసుకను దొంగిలించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు.

ప్రస్తుతం పెన్నా నదిలోని ఇసుకను నిబంధనలను అతిక్రమించి తరలించడం వల్ల ఇందుకూరుపేట మండలంలోని భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వేసవి కాలం దగ్గర పడుతుండటంతో వ్యవసాయ బోర్లు గుండా నీరు రాక.. మోటార్లు మరమ్మతుకు గురవుతున్నాయి. ప్రజలు తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల గోడు పట్టించుకొంటారో.. నాయకులకు కొమ్ము కాస్తారో చూడాలి !

Related posts