telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జాను” మొదటిరోజు వసూళ్లు

Jaanu

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జాను’. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ సినిమాకు ఇది రీమేక్. ఒక క్లాసిక్ మూవీకి రీమేక్ కావడం, అందులోనూ సమంత లాంటి మంచి నటి ఈ సినిమాలో నటించడంతో అంచనాలు పెరిగాయి. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసు వద్ద తొలిరోజు ‘జాను’ రూ.1.96 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రాంతాల వారీగా కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 88 లక్షలు, సీడెడ్‌లో రూ.28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.32 లక్షలు, తూర్పుగోదావరిలో రూ.17 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ.16 లక్షలు, కృష్ణాలో రూ.15 లక్షలు, నెల్లూరులో రూ.6.3 లక్షలు వసూలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా షేర్ రూ.2.30 కోట్లని సమాచారం. ఈ వారం రోజులు ‘జాను’కు ఎంతో కీలకం. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ‘జాను’ థియేట్రికల్ హక్కులను రూ.19 కోట్లకు విక్రయించారు. ఈ మొత్తం రాబట్టాలంటే తొలి వారం రోజులే కీలకం. తెలుగులో సమంత సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ‘ఓ బేబీ’, ‘మజిలీ’ సినిమాల టైంలో మంచి బజ్ చూశాం. కానీ, ‘జాను’ సినిమాకి వచ్చేసరికి ఆ బజ్ కనిపించలేదు. దీనికి కారణం ‘96’ సినిమాను ఇప్పటికే చాలా మంది చూసేయడం కావచ్చు. ‘96’ చూసినప్పటికీ ‘జాను’ను ఎంజాయ్ చేస్తారని, ఈ సినిమాలో మ్యాజిక్ ఉందని చిత్ర యూనిట్ ప్రచారం చేసింది. అయినప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయారు.

Related posts