శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన “96” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. యూఎస్‌లో ఇప్పటికే ‘జాను’ ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ‘జాను’ ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా మ్యాజిక్‌ను మాత్రం కచ్చితంగా ఫీలవుతారని ఒక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు. సమంత, శర్వానంద్ అద్భుతంగా చేశారట. లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్‌తో సినిమా మొదలైందని, ఆ తరవాత వచ్చిన ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో స్కూల్ ఎపిసోడ్ చాలా బాగుందని చెబుతున్నారు. చిన్ననాటి జానకి, రామ్ పాత్రల ఎంపికలోనే దర్శకుడు సగం విజయం సాధించేశారని కొనియాడుతున్నారు. డైరెక్టర్ ఎలాంటి మార్పులు లేకుండా ‘96’కు దించేశారట. మొత్తం మీద ప్రస్తుతానికి ‘జాను’కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో త్రిష, సమంత… విజయ్ సేతుపతి, శర్వానంద్… నటన మధ్య పోలిక మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మరి వాళ్ళను సమంత, శర్వా మరిపించగలిగారా అనేది చూడాలి.