మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై ఇసుక ఉండడంతో బైక్ స్కిడ్ అవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు అయ్యాయి. కాలర్ బోన్ విరిగిందని, బాడీలో ఎక్కడ బ్లీడింగ్ జరగలేదని, అవయవాలేవి కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదని వైద్యులు అంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.
అలాగే ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని ఈ ప్రమాదం గురించి తాజాగా మాదాపూర్ ఏసీపీ స్పందించారు.. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని.. దాని వల్ల తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని ఆయన అన్నారు. ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఏసీపీ తెలిపారు.
కాగా..తేజ్ ఈ బైక్‌ని రీసెంట్‌గా కొనుగోలు చేశారు. బండి నెంబర్ TS07 GJ1258. రూ.18లక్షల ఖరీదైన ఆ బైక్.. అనిల్ కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్ 1160 సీసీతో నడిచే ట్రంఫ్ బైక్. ఇది సరికొత్త హై ఎండ్ బైక్ . దీని బరువు 228 కేజీల వరకు ఉంటుంది.
బైక్ రైడింగ్ అంటే తేజ్‌కి చాలా ఇష్టం. షూటింగ్ లేని సమయంలో తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్ కు వెళతాడు. శుక్రవారం కూడా అదే క్రమంలో వెళుతున్న క్రమంలో ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం సమయంలో అతను హెల్మెట్ ధరించడం వలన పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు వైద్యులు.