telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

విమర్శలను పట్టించుకోని రష్యా..తొలి బ్యాచ్ వాక్సిన్ ఉత్పత్తి

corona vaccine

ప్రపంచంలోనే తొలిసారిగా కరోనాకు వ్యాక్సిన్ తయారు చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వీపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. అయినప్పటికే విమర్శలను పక్కనబెట్టి ఆ దేశం మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ తొలి బ్యాచ్ ని తయారు చేశామని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో శనివారం ప్రకటించారు.

ఈ నెలాఖరులోగా దాన్ని డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు అందిస్తామని ఆయన పేర్కొన్నట్టు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇక ఈ వ్యాక్సిన్ ను సరిగ్గా పరిశీలించ లేదని పలు దేశాలు ఆరోపిస్తుండగా, మరికొన్ని దేశాలు, తమకు వ్యాక్సిన్ పంపాలని రష్యాను కోరుతున్నాయి. ఈ వ్యాక్సిన్ గురించిన సమాచారం తమకు అందలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇక వచ్చే రెండు వారాల్లో తొలి బ్యాచ్ లో భాగంగా తయారైన వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ఇస్తామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొన్ని విదేశీ కంపెనీలు తమ టీకాపై అనుమానాలు వ్యక్తం చేయడం అర్థరహితమని మిఖాయిల్ వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో వ్యాక్సిన్ ను పెద్దఎత్తున తయారు చేయనున్నట్లు వెల్లడించారు.

Related posts