-
రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 60 శాతం మంది విద్యార్థుల భవితవ్యం ప్రైవేట్ స్కూల్స్ లోనే…
-
ట్రస్మా సభ భారీ సక్సెస్…
-
భారీ ఎత్తున తరలివచ్చిన కరస్పాండెంట్లు…
సమాజ నిర్మాణంలో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పాత్ర ప్రశంసనీయమనీ, రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 60 శాతం మంది విద్యార్థులకు మంచి విద్యను అందించడం ద్వారా ఎంతో మేలు చేస్తున్నారని రాష్ట్ర, రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.
బుధవారం ఎస్.వీ.ఆర్ గార్డెన్స్ లో జరిగిన ట్రస్మా రాష్ట్ర జనరల్ బోర్డు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సభకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీరు ఉద్యోగాలు అడుగుతలేరు… ఆర్థిక సాయం అంతకన్నా అడుగుతలేరు… స్వయం ఉపాధి పొందుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు.
బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ సమస్యల పరిష్కారం కోసం మీతో అండగా ఉండి పరిష్కరిస్తామని చెప్పారు.
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పైన సానుకూల దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు.
ప్రత్యేకంగా ట్రస్మా ప్రతినిధులతో సమావేశం అవుతానని భారీ ఎత్తున తరలివచ్చిన ప్రైవేట్ కరస్పాండెంట్ల హర్షద్వానాల మధ్య మంత్రి ప్రకటించారు.
మీతో అండగా ఉండడం అవసరమని మేము భావిస్తున్నాం… సమాజ నిర్మాణంలో మీ పాత్ర ప్రశంసనీయం… దీనిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నందున ప్రధాన బాధ్యత కూడా మీ పైననే ఉన్నదని చెప్పారు.
బడ్జెట్ స్కూల్స్ పేరెంట్స్ అదేవిధంగా స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయుల సంక్షేమం కూడా బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు వారికి అండగా ఉంటూ సహకరించాలని సూచించారు.
ట్రస్మా వేదికగా రాజకీయాలు వద్దని మంత్రి హితవు
ట్రస్మా విద్యాపరమైన అభివృద్ధి గురించి చర్చించాలి… క్వాలిటీ ఎడ్యుకేషన్ వేదికగా అనేక కార్యక్రమాలు నిర్వహించాలి.
అంతేకానీ రాజకీయాల కోసం కాదని ట్రస్మాను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకోవడం సరైనది కాదని ఆయన హితవు పలికారు.
ట్రస్మాను కొంతమంది రాజకీయాల కోసం వాడుకుంటున్న విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.
సీజీపీఏ కొనసాగించాలని మంత్రికి వినతి
పదవ తరగతి విద్యార్థుల పరీక్షలను సీజీపీఏ పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్ రమేష్ రావు, కోశాధికారి పీ. రాఘవేంద్ర రెడ్డిలు వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించాలని వారు కోరారు. ట్రస్మాకు లీజుకు నామ మాత్రపు అద్దెకు ఇవ్వాలనీ లేదా భవన నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరారు.
ట్రస్మాకు ప్రభుత్వ గుర్తింపునిచ్చి విద్యాసంబంధ పాలసీలు రూపొందించినప్పుడు సలహాలు.. సూచనలు తీసుకోవాలని కోరారు.
బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ నిబంధనలను ప్రత్యేకంగా రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్, ఇంటర్
నేషనల్ స్కూల్స్ నిబంధనలను వేరు చేయాల్సిన అవసరాన్ని వారు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రైవేట్ స్కూల్స్ లో బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతుంటారని కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ధనిక వర్గానికి చెందిన పిల్లలు చదువుతుంటారని మంత్రికి వివరించారు.
కొత్త స్కూల్స్ కు మాత్రమే ఎన్వోసీల విధానాన్ని అమలు చేయాలని పాత స్కూల్స్ కు అన్ని రకాల ఎన్వోసీ లను మినహాయించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.
ఎంఎస్ఎమ్ఈలకు మాదిరిగా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కు రుణాలు ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
దీనివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరిగి బడుగు బలహీన వర్గాల పిల్లలకు మేలు జరుగుతుందని వివరించారు.
కరోనా సమయంలో రెండు సంవత్సరాలు బస్సులు నడుపలేదని, అందువల్ల రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఆ బస్సులు నడుపుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.
అదేవిధంగా స్క్రాప్ చేసే విధానం తెలియకపోవడం వల్ల కొంతమంది కరస్పాండెంట్లు రవాణా శాఖ నిబంధనల మేరకు స్క్రాప్ చేయకుండా అమ్మేసుకున్నారని వారికి మరొక అవకాశం ఇచ్చి రవాణా శాఖ నిబంధనల మేరకు స్క్రాప్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రస్మాకు అండగా ఉంటాం:
ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి లు మాట్లాడుతూ ట్రస్మాకు తాము అండగా ఉంటామని ప్రకటించారు.
ట్రస్మా చేస్తున్న వినూత్న కార్యక్రమాలు మేము ఎప్పుడూ గమనిస్తున్నామని చెప్పారు. దిగువ మధ్య తరగతి మరియు మధ్య తరగతి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రైవేట్ స్కూల్స్కు అండగా ఉంటామని చెప్పారు.
విద్యా వికాసం కోసం పాటుపడుతున్న బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కోసం తాము అండగా ఉంటామని చెప్పారు.
ట్రస్మా స్కూల్స్ అభివృద్ధి కోసం వార్షిక ప్రణాళికల మేరకు ముందుకు సాగుతాం: ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్
బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అభివృద్ధి కోసం వార్షిక ప్రణాళికల మేరకు నిరంతరం పనిచేస్తామని… విద్యార్థుల బోధన సామర్ధ్యాలను మెరుగుపరచడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్ చెప్పారు.
ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంచడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాల క్వాలిటీని పెంచడం కోసం ఇప్పటివరకు 25వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని ఇది నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు.
విద్యారంగంలో వచ్చే నూతన పోకడలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు అందజేస్తూ టెక్నాలజీని అనుసంధానం చేసే విధంగా కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే రీతిలో బోధన కొనసాగేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు.
అదేవిధంగా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. విద్యా ప్రమాణాలను పెంచి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా ఉండే ప్రయత్నిస్తామని చెప్పారు.
ట్రస్మా జనరల్ బోర్డు తీర్మానాలు
ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు డిసెంబర్ 28న ఆన్లైన్ బ్యాలెట్ పద్ధతిలోఎన్నికలు జరిగాయి.
బుధవారం సుమారు రెండువేల మంది ప్రతినిధులతో పటాన్చెరులో పెద్ద ఎత్తున వార్షిక జనరల్ బోర్డు మీటింగ్ జరిగింది.
ట్రస్మా 33 జిల్లాల ప్రతినిధులు తరలిరావడంపై సమావేశం వర్షం వ్యక్తం చేసింది. 33 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో వార్షిక ప్రణాళికను కూడా ఖరారు చేశారు.
కరస్పాండెంట్ల అభివృద్ధి కోసం నాయకత్వ శిక్షణ మరింతగా నిర్వహించేందుకు తీర్మానించారు.
అదేవిధంగా విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంగా అభ్యసనా సామర్ధ్యాల కోసం శిక్షణలను నిరంతరం చేయాలని కూడా తీర్మానించారు.
ట్రస్మా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి ఏడు జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించిందనీ, టర్మ్ అయిపోతున్న జిల్లాల వారీగా ఎన్నికలు నిర్వహించే అధికారాలను ఇస్తూ జనరల్ బోర్డు తీర్మానం చేసింది.
అదే విధంగా రీసెర్చ్.. ట్రైనింగ్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని, బిల్డింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, క్రమశిక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని, సభ్యత్వం డాటా అప్డేట్ చేసుకోనేందుకు 100 రూపాయలు చెల్లించి రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తూ జనరల్ బోర్డు తీర్మానించింది.
బైలాస్ అమెండ్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని, అఫీషియల్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా వారు ఈ సందర్భంగా తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్ చైర్మన్ నారాయణరెడ్డి, గౌరవ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్ రెడ్డి కొమురయ్య, సుందర్, బండి లక్ష్మణ్, నాగరాజు, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, గొట్టి పర్తి భాస్కర్, బండి లక్ష్మణ్, బత్తుల లక్ష్మణ్,జిల్లా నాయకులు ఉమామహేశ్వరరావు, గుల్షన్ జనార్దన్ రెడ్డి, తేజ,మాదాల సతీష్, అచ్చయ్య, రామ్మోహన్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడ్డారు: రోజా