ఈ సీజన్ ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు ముంబై ఇండియన్స్. వరుస మ్యాచ్‌లకు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్న కీరోన్ పొలార్డ్ జట్టును నడిపిస్తున్నాడు. రోహిత్ శర్మ తొడకండరాల గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక కాలేదు. ఇది ఒకవైపు వివాదంగా మారినా, రోహిత్ ఫిట్‌గా లేడనేది వరుస మ్యాచ్‌లకు దూరం కావడాన్ని బట్టి అర్థమవుతోంది. కాగా, తాజాగా ముంబై ఇండియన్స్‌ను కలవర పెట్టి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ సీజన్‌లో మిగిలి ఉన్న ఐపీఎల్ మ్యాచ్‌లకు రోహిత్ అందుబాటులో ఉండటం కష్టమనేది ఆ వార్త సారాంశం.
రోహిత్ శర్మ రెగ్యులర్‌గా నెట్స్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నా, పిచ్‌లో పరుగు పెట్టడంలో ఇబ్బంది పడుతున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలంటే బ్యాటింగ్‌లో భారీ షాట్లే కాకుండా రన్నింగ్ కూడా ముఖ్యమే. ‘బ్యాటింగ్ వేరు.. రన్నింగ్ వేరు. రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు’ అని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో ఒక అధికారి వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మకు సంబంధించి ముందుస్తు ఫిట్‌నెస్ రిపోర్ట్‌ల్లో అతనికి 2 నుంచి 3 వారాల విశ్రాంతి అవసరమనేది స్పష్టం. ఇది బీసీసీఐ మెడికల్ టీమ్ ఇచ్చిన నివేదిక. ఇప్పుడు రోహిత్ ఫీల్డ్‌లో రన్నింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడనేది వార్త దానికి బలం చేకూరుస్తోంది.
ఒకవేళ రోహిత్‌కు 3 వారాల విశ్రాంతి అవసరమైతే ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల నాటికి కూడా సిద్ధం కాకపోవచ్చు. అక్టోబర్ 18వ తేదీన కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ ఆడలేదు. అదే ఇప్పుడు ముంబై ఫ్రాంచైజీని కలవర పరుస్తోంది. అటు కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా కూడా రోహిత్ అవసరం జట్టుకు ఎంతో ఉంది కాబట్టి అతను రాబోవు ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా.. లేదా అనేది ఫ్రాంచైజీలో ప్రశ్నార్థకంగా మారింది.నవంబర్ 5వ తేదీ నుంచి ప్లేఆఫ్స్ సమరం ఆరంభం కానుంది. మరి అప్పటికి రోహిత్ ఫిట్‌నెస్‌ను సాధించడం కష్టమే అంటున్నారు పలువురు విశ్లేషకులు.