కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారుపై అది పడింది.
వాటిల్లో ఒక కారులోని ప్రయాణికులు మహబూబ్‌నగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది.