telugu navyamedia
సినిమా వార్తలు

కేంద్ర మంత్రిపై ఫైర్ అయిన హీరో

Rithesh-Deshmukh

2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ సరిగా బాధ్యతలను నిర్వహించలేకపోయారని, ఉగ్రదాడులు జరిగిన సమయంలో తన కుమారుడి సినిమా రోల్ పైనే ఆయన దృష్టి సారించారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో పియూష్ గోయల్ పై విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు, బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ ముఖ్ మండిపడ్డాడు. ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉంటుందని, కానీ సమాధానం చెప్పుకోవడానికి మన మధ్యలో లేని వ్యక్తిని నిందించడం సరికాదని అన్నారు.

ఉగ్రదాడి చోటు చేసుకున్న తాజ్/ఒబెరాయ్ హోటల్స్ కు తాను వెళ్లిన సంగతి నిజమేనని, అయితే కాల్పులు, పేలుళ్లు జరుగుతున్న సమయంలో తాను అక్కడకు వెళ్లానని చెప్పడం మాత్రం అబద్ధమని, తన తండ్రితో పాటు ఘటనా స్థలానికి తాను వెళ్లడం నిజమేనని, బాలీవుడ్ సినిమాలో తనకు ఒక రోల్ ను సంపాదించి పెట్టడానికి తన తండ్రి యత్నించారని చెప్పడం మాత్రం అబద్ధమని, తనను సినిమాలో తీసుకోవాలని ఏ దర్శకుడినీ, ఏ నిర్మాతనూ తన తండ్రి ఎప్పుడూ కోరలేదని రితీశ్ తెలిపాడు. ఇదే ఆరోపణలు ఏడేళ్ల క్రితం చేసి ఉంటే తన తండ్రి సమాధానం చెప్పేవారని మండిపడ్డారు. రితేష్ దేశ్ ముఖ్ కు తెలుగులో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ జెనీలియా భార్య అన్న విషయం తెలిసిందే.

Related posts