telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను చనిపోయినప్పుడు నన్ను మోసేందుకు ఎవరూ ఉండరు : రిషికపూర్ ట్వీట్

rishikapoor

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషికపూర్ గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. చాలాకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రిషికపూర్ మృతి సంతాపం తెలియజేస్తూ.. సెలబ్రిటీలు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2017లో రిషికపూర్ చేసిన రెండు ట్వీట్లు ఫ్యాన్స్‌తో కన్నీళ్లు పెట్టిస్తున్నారు. 2017 ఏప్రిల్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతి చెందారు. అయితే వినోద్ ఖన్నా అంత్యక్రియలకు బాలీవుడ్‌ నుంచి సెలబ్రిటీలు ఎక్కువశాతం హాజరుకాలేదు. ఈ ఘటన రిషికపూర్‌కు ఆగ్రహం తెప్పించింది. అంతటి నటుడు మృతి చెందితే.. కనీసం ఆయనకు నివాళి అర్పించేందుకు కూడా ఎవరూ రాకపోవడం సిగ్గుచేటు అంటూ రిషికపూర్ ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి పని చేసిన వాళ్లు కూడా ఆయన అంత్యక్రియలకు హాజరుకాకపోవడంపై ఆయన మండిపడ్డారు. పెద్దలను గౌరవించడం నేర్చుకోండి అంటూ ఆయన పేర్కొన్నారు.

అయితే రిషికపూర్ అంతటితో ఆగకుండా ‘‘ఇది ఇంతటితో ఆగదు. నా విషయంలోనే.. వేరే వాళ్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. నేను చనిపోయినప్పుడు. నన్ను మోసేందుకు ఎవరూ ఉండరు. అందుకు సిద్ధంగా ఉండాలి. ఈరోజు స్టార్స్ అని చెప్పుకొనే వాళ్లని చూస్తే.. చాలా చాలా కోపం వస్తుంది’’ అని ఆయన మరో ట్వీట్ చేశారు. అయితే రిషికపూర్ చేసిన రెండో ట్వీట్ అక్షర సత్యమైంది. కానీ, కొన్ని ఊహించని పరిస్థితుల్లో అది జరిగింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆయన అంత్యక్రియలకు ఎవరూ హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. అంత్యక్రియలకు కేవలం 20 మంది మాత్రమే హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ముంబైలోని మరీనా లైన్స్‌లోని చందన్‌వాడీ స్మశానవాటిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. దీంతో రిషికపూర్ ఆనాడు చేసిన ట్వీట్‌ని గుర్తు చేసుకుంటూ ఆయన అభిమానులు కన్నీరు పెడుతున్నారు.

Related posts