telugu navyamedia
క్రీడలు వార్తలు

నేను నా కంటూ పేరు సంపాదించుకోలనుకుంటున్నాను : పంత్

ఆస్ట్రేలియా పర్యటనను ఘ‌నంగా ముగించిన భారత జట్టు స‌భ్యులు స్వదేశానికి వచ్చారు. సొంత‌గ‌డ్డ‌పై అందరికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. జట్టు స‌భ్యులు దుబాయ్ మీదుగా స్వ‌దేశానికి వచ్చారు. కెప్టెన్ అజింక్య ర‌హానే, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ ర‌విశాస్త్రి, ఓపెన‌ర్ పృథ్వి షా ముంబైకి చేరుకున్నారు. తెలుగు ఆటగాళ్లు హనుమ విహారి, మహ్మద్‌ సిరాజ్‌లు గురువారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇక వికెట్ కీపర్ రిష‌బ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు. టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రిష‌బ్ పంత్‌ను మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీతో పోలుస్తున్నారు. అందులోనూ బ్రిస్బేన్ టెస్ట్‌లో ధోనీ రికార్డును కూడా తిర‌గ‌రాయ‌డంతో.. ఈ పోలిక మ‌రింత ఎక్కువైంది. అయితే పంత్ మాత్రం త‌న‌ను ధోనీతో పోల్చొద్ద‌ని అంటున్నాడు. తనకంటూ ప్ర‌త్యేక పేరు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. గురువారం ఢిల్లీలో అడుగుపెట్టిన పంత్ మీడియాతో మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను ధోనీతో పోల్చొద్ద‌ని కోరాడు. ‘ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయ‌ర్‌తో పోలుస్తుంటే.. చాలా బాగుంటుంది. కానీ న‌న్ను ఎవ‌రితోనూ పోల్చ‌డం నాకు ఇష్టం ఉండ‌దు. ఇండియ‌న్ క్రికెట్‌లో నాకంటూ ప్ర‌త్యేకంగా పేరు సంపాదించుకోవాల‌ని అనుకుంటున్నాను. ప్ర‌స్తుతం నా దృష్టంతా దానిపైనే. ఓ లెజెండ‌రీ ప్లేయ‌ర్‌తో ఓ యువ‌కుడిని పోల్చ‌డం స‌రికాదు. ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడంతో జట్టు మొత్తం చాలా సంతోషంగా ఉందని నేను భావిస్తున్నాను’ అని రిష‌బ్ పంత్ తెలిపాడు. పంత్ సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 97, బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 89 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. రిషభ్ పంత్‌ బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వృద్ధిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97.

Related posts