telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీలంక ఎయిర్ పోర్ట్ లో నరాల్లో వణుకు పుట్టించిన ఘటన

RGV Nag Film-Unforegatable Incident in Srilanka Airport
ఇది సరిగ్గా 27 సంవత్సరాల నాటి సంగతి . నేను అప్పుడు ఆంధ్ర జ్యోతి వారి జ్యోతి చిత్ర లో పనిచేస్తున్నా . 1989 వ సంవత్సరం లో “శివ “సినిమాతో రాంగోపాల్ వర్మ కు గుర్తింపు గౌరవం వచ్చింది . రామ్ గోపాల వర్మను దర్శకుడుగా అక్కినేని  నాగార్జున , యార్లగడ్డ సురేంద్ర  పరిచయం చేశారు  . ఆ తరువాత శివ సినిమాను నాగార్జున హీరోగా , వర్మ దర్శకుడుగా హిందీలో “శివ్ ” పేరుతో  నిర్మించారు . ఆ తరువాత నాగార్జున అమితాబ్ తో “ఖుదా గవ ” అనే హిందీ సినిమాలో నటించాడు 1992లో వర్మ,  నాగార్జున , ఊర్మిళ హీరో హీరోయిన్ గా తెలుగులో “అంతం” , హిందీలో “ద్రోహి ” అనే ద్విభాషా చిత్రం నిర్మాత గా మొదలు పెట్టాడు . 
రామ్ గోపాల వర్మ తండ్రి కృష్ణం రాజు గారితో నాకు బాగా పరిచయం. కృష్ణం రాజు గారు అన్నపూర్ణ స్టూడియోస్ లో సౌండ్  ఇంజినీర్ గా పనిచేస్తుండేవారు . అలా రామ్ రామ్ గోపాల్ వర్మ నాగార్జునకు పరిచయం . వర్మ శివ సినిమా కథ చెప్పిన తరువాత అందరికీ బాగా నచ్చింది . శివ సినిమా మొదలు కాక ముందే కృష్ణం రాజు గారు నాకు వర్మను పరిచయం చేశాడు . అప్పటి నుంచి వర్మ సినిమాల ప్రచారం అంతా నేను చూసేవాడిని . వర్మ “అంతం ” సినిమా షూటింగ్ హైద్రాబాద్లో మొదలు పెట్టి రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు . ఒక షెడ్యూలు ను శ్రీలంకలో తీయాలని ప్లాన్ చేశారు . శ్రీలంక లో 10   రోజుల పాటు జరిగే షూటింగ్ కు నన్ను కూడా ఆహ్వానించాడు .   ఇండియన్ ఎక్సప్రెస్ లో పనిచేసే ఉల్గ్ నాథన్ ను కూడా తీసుకెడదామని వర్మకు చెప్పాను . “అతనెందుకు ,వద్దు ” అన్నాడు ఉల్గ్ నాథన్  అంటే వర్మకు సదభిప్రాయం లేదు . అందుకే వద్దని చెప్పాడు . 
అయితే ఉల్గ్ నాథన్  ఎక్సప్రెస్స్ తో పాటు స్క్రీన్ లో కూడా సినిమాల గురించి రాస్తూండేవాడు . వర్మ “అంతం ” సినిమా తో పాటు “ద్రోహి ” సినిమా కూడా  నిర్మిస్తున్నాడు . ఇది ద్విభాషా సినిమా. అందుకే “ఉల్గ్ నాథన్  కూడా తీసుకెడితే మనకు , ఎక్సప్రెస్స్ తో పాటు స్క్రీన్ లో ఫుల్ పేజీ కవరేజ్ వస్తుంది” అని వర్మకు చెప్పాను . వర్మ వప్పుకున్నాడు . అయితే “అతని వ్యవహారం మీరే చూసుకోండి” అని చెప్పాడు . నేను సరే అన్నాను .  నేను శ్రీలంక సినిమా షూటింగ్ కవరేజ్ కోసం వెడుతున్నానని తెలిసి జర్నలిస్టు మిత్రులంతా జాగ్రత్తలు చెప్పారు . కారణం అప్పుడు శ్రీలంకలో ఎల్ టి టి ఈ ప్రభావం ఎక్కువ వుంది . లంకలో నిత్యం మారణ హోమం జరుగుతూ ఉండేది . అలా నాతో పాటు  ఉల్గ్ నాథన్ కూడా శ్రీలంకకు బయలుదేరాడు . ఏర్పాట్లన్నీ వర్మ ప్రొడక్షన్ హౌస్ చేసింది . 
RGV Nag Film-Unforegatable Incident in Srilanka Airport
యూనిట్ అందరూ ముందే శ్రీలంక వెళ్లారు . మేము ఇద్దరమే మే 14 న ఉదయం హైదరాబాద్ నుంచి చెన్నయ్ విమానంలో బయలుదేరాం . అదేరోజు  రాత్రి 7. 30 గంటలకు ఎయిర్ లంక విమానం ఎక్కాము . చెన్నై నుంచి శ్రీలంక 55 నిముషాల ప్రయాణం . ఎక్కువ భాగం సముద్రం మీదుగా విమానం వెడుతుంది మేము శ్రీలంక విమానాశ్రయానికి రాత్రి 8. 25కు చేరాము . ప్రయాణికులను తీసుకెళ్లడాని విమానం దగ్గరకు బస్సు వచ్చింది . మేము విమానం దిగే సమయంలో చిన్నగా చినుకులు పడుతున్నాయి . 
శ్రీలంక భూమి మీద కాలు పెట్టగానే జర్నలిస్టు మిత్రులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి . ఎల్ టి టి ఈ  గుర్తుకు రాగానే కాళ్లలో చిన్నగా వణుకు . అయితే ఉల్గ్ నాథన్  ముఖం అదేం కనిపించలేదు . దేశం వదిలి మరో దేశం వెళ్లడం నాకు అదే మొదటిసారి . అదీ తీవ్ర వాదం వున్న శ్రీలంక కావడం . ఇలా ఆలోచిస్తూ ఉండగానే బస్సు విమానాశ్రయ ప్రవేశ ద్వారం దగ్గర ఆగింది . కిందకు దిగి పాస్ పోర్ట్ చేతితో పట్టుకొని క్యూ లో నుంచున్నాము . ముందు ఉల్గ్ నాథన్ ను నిలబెట్టి నేను వెనుక వున్నాను. లోపల శ్రీలంక ఎయిర్ పోర్ట్  అధికారులు పాసుపోర్టు లు చూస్తూ ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు . 
మావంతు వచ్చింది . ఉల్గ్ నాథన్ తన పాసుపోర్టు చూపించాడు . ఆ పాస్ పరిశీలించిన  ఓ అధికారి ” శ్రీలంక  దేశానికి ఎందుకు వస్తున్నారు ? ” అని   అడిగాడు ఉల్గ్ నాథన్ ఆ ధికారి వైపు చూస్తూ “ఫర్ షూటింగ్ పర్పస్ ” అని సమాధానం చెప్పాడు . అంతే ఆ అధికారి ఉల్గ్ నాథన్ ను పక్కకు లాగాడు . అధికారి ఉల్గ్ నాథన్ పాస్ పోర్టును మిగతా అధికారులకు ఇచ్చి “మిస్టర్ ఉల్గ్ నాథన్ .. తమిళియన్ , బర్త్ ప్లేస్  తంజావూరు … కేం ఫర్  షూటింగ్ ” అని చెప్పాడు . అది చూసి నాకు మరింత టెన్షన్ మొదలైంది . అప్పటికి నాకు జరిగిందేమిటో అర్ధమైంది . 
కాళ్లలో వణుకు ఎక్కువైంది . అయినా ఆ క్షణంలో  తెలియని ధైర్యం వచ్చేసింది . నా పాస్ పోర్ట్   అధికారులు చూపిస్తూ … “యు అర్ మిస్టే కన్ సర్ … వియ్ అర్ జర్నలిస్ట్స్   కమింగ్  ఫ్రమ్ హైదరాబాద్. వియ్ అర్ కేం ఫర్ ఫిలిం షూటింగ్ , సీ  అవర్ ఐడీ కార్డ్స్ ” అని వివరించాను  . అప్పుడు ఉల్గ్ నాథన్ కూడా తేరుకొని తన ఐడీ కార్డు చూపించాడు . ఇద్దరి దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ కార్డ్స్ వున్నాయి. అప్పుడు విమానాశ్రయ అధికారులు మమ్మలి వదిలిపెట్టారు .RGV Nag Film-Unforegatable Incident in Srilanka Airportహమ్మయ్య అనుకుంటూ విమాశ్రయం బయటకు వచ్చాము . అప్పకే కారు తో ప్రొడక్షన్ మేనేజర్ ఎదురు చూస్తున్నాడు . వర్మ మా ఇద్దరికీ స్టార్ హోటల్ రమడా లో రూమ్ ఏర్పాటు చేశాడు . ఉల్గ్ నాథన్ రూమ్ ఫ్రిడ్జ్ లో వున్నా మందు కొట్టి పడుకున్నాడు . ఆ రోజు చాలా లేటుగా నిద్ర లేచాము . అప్పటికే యూనిట్ అంతా షూటింగ్ కు వెళ్ళిపోయింది . మా కోసం ఓ కార్ ఏర్పాటు చేశారు . అయితే ఆ రోజు రూమ్ లోనే రెస్టు తీసుకున్నాము . మే 16వ తేదీ మేము  ఇద్దరం యూనిట్ తో పాటు షూటింగ్ కు వెళ్ళాము . అవుట్ డోర్ లో షూటింగ్ . శ్రీలంక లోని ప్రజలు నాగార్జున ను చూడటానికి వచ్చారు . నాగార్జున అందరినీ పలకరిస్తున్నారు .  శ్రీలంక సింహళ భాష తెలిసిన ఒకతన్ని పెట్టారు . అతను  వచ్చి అక్కడి వారు ఏమి అడుగు తున్నారో నాగార్జునకు ఇంగ్లీషులో చెబుతున్నాడు . నాగార్జున నటించిన ఖుదా గవ, శివ్ హిందీ చిత్రాలను చూశామని వారు చెప్పారు. 
అంతలో ఒకతను శ్రీలంక పత్రికలో నాగార్జున గురించి వచ్చిన ఒక వార్తను చూపించాడు . అది చూసి నాగార్జున చాలా సంతోష పడ్డాడు . రామ్ గోపాల్  వర్మ సింహళ భాష  తెలిసిన అతన్ని చదవమని చెప్పాడు . అతను చదువుతుంటే నాగార్జున , రామ్ గోపాల్ వర్మ శ్రద్దగా విన్నారు . ఆ తరువాత వర్మ మాకు ఓ కారు ఏర్పాటు చేసి , శ్రీలంక డబ్బు ఇచ్చి శ్రీలంక లోని మిగతా ప్రతాలు చూసి రమ్మని చెప్పాడు . 
శ్రీలంక రాజధాని కొలంబోలో ట్రాఫిక్ పోలీసులు ఏ  కె  47 గన్స్ పట్టుకొని నిలబడి ఉండటం ఆశ్చర్యమనిపించింది . అప్పటికీ పెద్ద పెద్ద మాల్స్ వున్నాయి. విశేషం ఏమిటంటే 1992లోనే శ్రీలంక లో ఏటీఎం లు వున్నాయి శ్రీలంక రాజధాని కొలంబో , నూరేలియా , క్యాండీ లో అంతం , ద్రోహి చిత్రాల షూటింగ్ జరిగింది . మేము మాత్రం శ్రీలంక అంతా చూశాము .  వర్మ , నాగార్జున “అంతం ” షూటింగ్ లో భయం కలిగించిన అనుభవం . 
-భగీరథ 

Related posts