తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల పదవుల రద్దు చట్టం- 2020 పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం తెలంగాణలో వీఆర్వో పదవులు రద్దవుతాయి. వెంటనే వీఆర్వోలు పదవి విరమణ లేదా రాజీనామా చేయాలని బిల్లులో తెలిపారు.
వీఆర్వోలను ఏదైనా ప్రభుత్వ శాఖలోని ఏదైనా సమానమైన శ్రేణిలోకి బదిలీ లేదా విలీనం చేయనున్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన రోజు ఉన్నంత సంతోషం ఇవాళ ఉందన్నారు. ఈ రోజు చారిత్రాత్మకమైన రోజన్నారు. ఈ బిల్లు ప్రతీ కుటుంబానికి వర్తిస్తుందన్నారు.
-రెవెన్యూ బిల్లులోని పలు ముఖ్యాంశాలు:
-కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికి విచక్షణాధికారాలు ఉండవు.
-కొత్త రెవెన్యూ చట్టంతో ఇకపై ఆస్తి తగాదాలు ఉండవు.
-ధరణి పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి.
-అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ లాండ్ వివరాలు ధరణి పోర్టల్‌లో ఉంటాయి.
-ప్రపంచంలో ఏ మూలనుంచైనా ధరణి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయవచ్చు.
-రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్.
-మ్యూటేషన్ పవర్‌ను కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు అప్పగింత.
-మ్యూటేషన్ అయిన వెంటనే ధరణిలో అప్‌లోడ్.
-రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పాస్‌బుక్, ధరణి కాపీ వెంటనే తీసుకోవచ్చు.
-ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి.
-మోసపురితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తే, రద్దు చేసే అధికారం కలెక్టర్ కు ఉంది
-పాస్ పుస్తకాన్ని మోసపూరితంగా జారీ చేసిన చేసిన తహశీల్దార్ పై బర్తరఫ్ క్రిమినల్ కేసులు- తిరిగి భూములు స్వాధీనం.
-కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం-ప్రభుత్వ అధికారి పై ఎటువంటి దావా వేయకూడదు
-ఇప్పటి వరకు ఎటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు ప్రోజీసర్ ప్రకారం పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం తహశీల్దార్ కు ఉంది.
-డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి.