తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
ఇంగ్లండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో రేపు రేవంత్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
టోనీ బ్లెయిర్ ప్రస్తుతం ‘టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ)’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది.
ఈ నేపథ్యంలో, టీబీఐ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అందగల సహకారం, పెట్టుబడుల అవకాశాలపై రేవంత్ రెడ్డి చర్చలు జరిపే వీలుంది.
ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది.
పార్టీలో ఇంకా భర్తీ కాకుండా పెండింగ్‌లో ఉన్న పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలకమైన సంస్థాగత అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో ఆయన చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వీటితో పాటు, పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి అంశాలపై వినతిపత్రాలు సమర్పించి, చర్చించే వీలుందని సమాచారం.
పోలీసులు కక్ష కట్టి వేధిస్తున్నారు: అఖిలప్రియ