telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో రాహుల్ టూర్‌: కేటీఆర్, కవితకు కౌంటరిచ్చిన‌ రేవంత్ రెడ్డి

ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రెండురోజులు తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు పలు విమర్శలు చేస్తూ ..ట్వీట్ల వ‌ర్షం కురిపించారు.

ఇవాళ‌ రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్న తరుణంలో తెలంగాణ కోసం మీరు ఏం చేశారంటూ ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని ప్రశ్నలు సంధించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణదేనని, ఆ విషయం అర్థం చేసుకునేందుకు అయినా మీకు స్వాగతం అంటూ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి కవిత కల్వకుంట్ల ట్వీట్‌ చేశారు.

పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను, అంశాలను మీరు(రాహుల్‌ గాంధీని ఉద్దేశించి) ఎన్నిసార్లు ప్రస్తావించారు?, టీఆర్‌ఎస్‌ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతుంటే ఎక్కడ ఉన్నారు అంటూ నిలదీశారామె.

దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ..‘చూసుకొని మురవాలి…చెప్పుకొని ఏడ్వాలి…’అంటూ ఆమెకు ట్వీట్‌కు రీ ట్వీట్‌ చేశారు.

తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. కవితను ట్యాగ్ చేస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు రేవంత్ రెడ్డి.‘కవితగారూ.. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. ?మీ నాన్న కేసీఆర్, ప్రధాని మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ?

వరి వేస్తే ఉరేనని మీ నాన్న ప్రవచనాలు చెప్పిన ఆయన ఫాంహౌస్‌లో 150 ఎకరాలలో వరి పంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ?.ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గండ జిల్లాల్లో మిర్చీ రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? అని పలు ప్రశ్నలు సంధిస్తూ కవితకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

అలాగే రైతుల పక్షపాత ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో పర్యటనకు రాహుల్‌ గాంధీకి స్వాగతం చెబుతామని, ఇక్కడి విధీవిధానాలు నేర్చుకుని కాంగ్రెస్‌ విఫలిత రాష్ట్రాల్లో అమలు చేసుకునేందుకు ఇదొక మంచి అవకాశం అంటూ ఓ కథనాన్ని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేయగా..  

మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్!.. రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి? ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలా బిగించాలి? వరి,మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు?.. ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారు అంటూ ట్వీట్‌తోనే బదులిచ్చారు. 

Related posts