telugu navyamedia
తెలంగాణ వార్తలు

వాళ్లకు సన్మానం చేయండి..

ప్రజలగొంతును విన్పిస్తారని, ప్రజల సమస్యను పరిష్కరిస్తారని ప్రతినిధులుగా చట్టసభలకు పంపితే… డ్రామాలాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యంసేకరణలో కేంద్రప్రభుత్వం, కొనుగోలు విషయంలో రాష్ట్రప్రభుత్వం రైతులలతో పరిహాసమాడుతున్నాయన్నారు.

చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయలేని దద్దమ్మలు, సభనుంచి బయటకు రావడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీసే సత్తాలేకుండా పార్లమెంటులోంచి పారిపోయారని ఆయన ధ్వజమెత్తారు. సభల్లో మాట్లాడలేని ప్రజాప్రతినిధులు తిరిగొచ్చినపుడు… గ్రామీణప్రాంతాల్లో రైతులు, మహిళలు తమదైన శైలిలో సన్మానించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రపు నిరసనలు వ్యక్తం చేశారని విమర్శించారు. ఫోటోలకు ఫోజులు తప్ప.. టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదన్నారు. నిరసన తెలుపుతున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఎందుకు నిలదీయడంలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతానన్న కేసీఆర్.. ఫాంహౌస్‌లో పడుకున్నారని విమర్శించారు.

Related posts