telugu navyamedia
సాంకేతిక

ఇక ఆఫీసుల నుంచే పనిచేయనున్న ఐటీ ఉద్యోగులు!

కరోనా నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం ఇంటినుంచే కార్యకలాపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాస్త కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు 5 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండగా దీని సంఖ్య డిసెంబర్ నాటికి 50 శాతానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనిపై హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ఫ్యూచర్ వర్క్ మోడల్స్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. 500 మంది ఉద్యోగులకన్నా తక్కువగా ఉన్న ఐటీ సంస్థల్లో ఇప్పటికే 20 శాతం మంది ఆఫీసులకు వస్తున్నట్లు పేర్కొంది. 76 శాతం కంపెనీల్లో 9 శాతం మంది కార్యాలయాలకు వస్తుండగా మధ్యస్థాయి, పెద్ద, అతిపెద్ద కంపెనీల ఉద్యోగుల్లో 5 శాతం మంది ఆఫీసులకు వస్తున్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది చివరికి తమ ఉద్యోగులందరినీ ఆఫీసుకు రప్పించాలని 33 శాతం సంస్థలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ పని పూర్తి చేయాలని 41 శాతం కంపెనీలు అనుకుంటున్నాయి. బహుళజాతి సంస్థలు మాత్రం, తమ ప్రధాన కార్యాలయాల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించనున్నాయి. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు 6 లక్షల మంది అయితే 2 లక్షల మందికి పైగా దూర ప్రాంతాల నుంచే పనిచేస్తున్నారు. 70 శాతానికి పైగా సంస్థలు హైబ్రిడ్‌ పని విధానానికే మొగ్గు చూపుతున్నాయి. ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదకత తగ్గిందని 22శాతం సంస్థలు తెలిపాయి.

 

Related posts