telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఇకపై గృహ, వాహన రుణాలు ఇంకాస్త చౌక…!

Home

గృహ, వాహన రుణాలు ఇంకాస్త చౌకగా లభించనున్నాయి. మంగళవారం నుంచి అమలులోకి రానున్న కొత్త విధానంతో కొన్ని బ్యాంకుల రిటైల్‌ రుణాలపై వడ్డీ భారం 0.30 శాతం వరకు తగ్గవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అక్టోబరు 1 నుంచి బ్యాంకులు రిటైల్‌తోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ)కిచ్చే రుణాల వడ్డీ రేటును ‘రెపో’ లేదా ఇతర మార్కెట్‌ రేటుతో అనుసంధానించడం ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు ప్రస్తుతం 5.40 శాతంగా ఉంది. రెపో లేదా ఇతర మార్కెట్‌ రేటుపై కొంత మార్జిన్‌ కలుపుకొని బ్యాంకులు తాము ఆఫర్‌ చేసే రుణాలకు ప్రామాణిక వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. మార్జిన్‌ విషయంలో మాత్రం బ్యాంకులపై ఎలాంటి పరిమితి ఉండదు. ఉదాహరణకు, దేశంలోని అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ.. సెప్టెంబరులో లాంచ్‌ చేసిన రెపో అనుసంధానిత గృహ రుణంపై ప్రామాణిక వడ్డీ రేటును 8.05 శాతంగా నిర్ణయించింది. అయితే, ఎస్‌బీఐ ఈ పథకాన్ని ఉపసంహరించుకుంది. ఏదేని బహిరంగ మార్కెట్‌ రేటుతో ఫ్లోటింగ్‌ రుణాల అనుసంధానం తప్పనిసరి చేసిన నేపథ్యంలో తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

రుణగ్రహీత రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా బ్యాంకులు ప్రామాణిక వడ్డీ రేటుకు అదనంగా వసూలు చేస్తాయి. సాధారణంగా రిస్క్‌ గ్రూపు 4-6 పరిధిలోకి వచ్చేవారు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు, వేతన జీవులు కానివారి నుంచి ఎస్‌బీఐ ప్రామాణిక రేటుపై 0.15 శాతం అదనపు వడ్డీ వసూలు చేస్తుంది. ఇక రిస్క్‌ గ్రూపు 4-6లో ఉంటే మరో 0.10 శాతం అదనపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

రెపో తగ్గితే రుణగ్రహీతలకు తదనుగుణంగా నెలవారీ చెల్లింపుల(ఈఎంఐ) భారం కూడా తగ్గుతుంది. ఆర్‌బీఐ రెపో పెంచుతూపోతే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు, రెపో రేటు ఒక శాతం పెరిగితే 15 ఏళ్ల కాలానికి రూ.75 లక్షల రుణం తీసుకున్న వారి ఈఎంఐ భారం రూ.4,500 మేర పెరగవచ్చని దేశీ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంటోంది.

Related posts